Rains in Telangana AP: నైరుతి రుతుపవనాల తిరోగమనంతో సీజన్‌లో చివరిసారి వీటి ప్రభావంతో పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఆదివారం పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో వేర్వేరుగా రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. రెండో ఆవర్తనం నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనంలో విలీనం అవుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రెండు ఆవర్తనాల ప్రభావంతో నేడు, రేపు రెండు రోజులపాటు ఏపీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్ష సూచన ఉంది. 


తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather)
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 3, 4 వరకు ఏపీ, తెలంగాణ, యానాంలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదివారం సైతం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ రాష్ట్రం దక్షిణ భాగాల్లో కురుస్తున్న వర్షాలు, పిడుగులు ఆంధ్ర - తెలంగాణ బార్డర్ ప్రాంతాల వైపుగా వస్తున్నాయి. 





నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచననున్నాయి. నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. రంగారెడ్డి జిల్లాతో పాటు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. వర్షం పడని ప్రాంతాల్లో మధ్యాహ్నానికి ఉక్కపోత అధికం అవుతుంది. 
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వైజాగ్ లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మరో వైపున పార్వతీపురం మణ్యం జిల్లాలోని సాలూరు - యస్.కోట వైపు వర్షాలు పెరగనుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కళితో పాటుగా కాకినాడ జిల్లాలోని ఉత్తర భాగాల్లో కూడ వర్షాలుంటాయి. విజయనగరం, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయి. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. విజయనగరం భోగపురం - ఆనందపురం వైపు నుంచి వచ్చే మేఘాలతో వైజాగ్ ఉత్తర భాగాలైన భీమిళి, రిషికుండ, మధురవాడ వైపు వర్షాలు విస్తారంగా ఉంటాయి.






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. అక్టోబర్ 3, 4 తేదీల్లో గుంటూరు, ఎన్.టీ.ఆర్ జిల్లాలో వర్షాలు కురవనున్నాయి. ఒంగోలు - సింగారాయకొండ బెల్ట్ తో పాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.  
రాయలసీమలోనూ నేడు స్వల్ప వర్షాలున్నాయి. నంద్యాల, కర్నూలు జిల్లా సహా సీమ జిల్లాల్లో పిడుగులే పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో పాటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.