దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ మిల్లర్ (106 నాటౌట్: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు) వీరోచితంగా పోరాడి సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సిరీస్‌ను కూడా టీమిండియా 2-0తో దక్కించుకుంది. భారత జట్టు దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి.


238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ మందకొడిగా ప్రారంభం అయింది. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు చేరేసరికే ఓపెనర్ టెంబా బవుమా (0: 7 బంతుల్లో), వన్ డౌన్ బ్యాటర్ రిలీ రౌసో (0: 2 బంతుల్లో) అవుటయ్యారు. ఆ తర్వాత కాసేపటికే ఫాంలో ఉన్న ఎయిడెన్ మార్క్రమ్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. 


దీంతో భారత్ గెలుపు పక్కా అనుకున్నారంతా. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (69 నాటౌట్: 48 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (106 నాటౌట్: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు) దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. 10 ఓవర్లలో విజయానికి 170 పరుగులు అవసరం అయిన దశలో వీరు ఎంతో వేగంగా ఆడారు. ఆఖరి ఐదు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు రాబట్టారు. ఈ క్రమంలోనే మిల్లర్ సెంచరీ పూర్తయింది. కానీ విజయానికి ఈ వేగం సరిపోలేదు. 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 221 పరుగులకే పరిమితం అయ్యారు. దీంతో 16 పరుగులతో గెలుపు టీమిండియా సొంతం అయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు.


అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (57: 28 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), రోహిత్ శర్మ (43: 37 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) చెలరేగి ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లలోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. మొదటి వికెట్‌కు 96 పరుగులు జోడించిన అనంతరం కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో రోహిత్ అవుటయ్యాడు.


ఆ తర్వాతి ఓవర్లోనే కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ పూర్తయింది. వెంటనే తను కూడా అవుటయ్యాడు. ఈ దశలో జత కలిసిన సూర్యకుమార్ యాదవ్ (61: 22 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (49 నాటౌట్: 28 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) స్కోరు వేగాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 43 బంతుల్లోనే 102 పరుగులు జోడించడం విశేషం. సూర్యకుమార్ యాదవ్ గ్రౌండ్‌కు అన్ని వైపులా భారీ షాట్లతో చెలరేగాడు. బంతి తన బ్యాట్‌కు తగిలితేనే బౌండరీ వెళ్తుందా అనే రేంజ్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ సాగింది. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో లేని పరుగుకు ప్రయత్నించి సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు.


15వ ఓవర్ నుంచి 18వ ఓవర్ వరకు నాలుగు ఓవర్లలోనే టీమిండియా 76 పరుగులు సాధించడం విశేషం. దీంతో టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.