దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా విజయానికి 20 ఓవర్లలో 238 పరుగులు కావాలి. సూర్యకుమార్ యాదవ్ (61: 22 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (57: 28 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), రోహిత్ శర్మ (43: 37 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) చెలరేగి ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లలోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. మొదటి వికెట్‌కు 96 పరుగులు జోడించిన అనంతరం కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో రోహిత్ అవుటయ్యాడు.
ఆ తర్వాతి ఓవర్లోనే కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ పూర్తయింది. వెంటనే తను కూడా అవుటయ్యాడు. ఈ దశలో జత కలిసిన సూర్యకుమార్ యాదవ్ (61: 22 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (49 నాటౌట్: 28 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) స్కోరు వేగాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 43 బంతుల్లోనే 102 పరుగులు జోడించడం విశేషం. సూర్యకుమార్ యాదవ్ గ్రౌండ్‌కు అన్ని వైపులా భారీ షాట్లతో చెలరేగాడు. బంతి తన బ్యాట్‌కు తగిలితేనే బౌండరీ వెళ్తుందా అనే రేంజ్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ సాగింది. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో లేని పరుగుకు ప్రయత్నించి సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు.
15వ ఓవర్ నుంచి 18వ ఓవర్ వరకు నాలుగు ఓవర్లలోనే టీమిండియా 76 పరుగులు సాధించడం విశేషం. దీంతో టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.