Bharat Jodo Yatra:
వర్షంలోనే ప్రసంగించిన రాహుల్..
భారత్ జోడో యాత్రలో చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు రాహుల్ గాంధీ. పార్టీలో ఉత్తేజం నింపేందుకు ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలే కేరళలో యాత్రను ముగించుకున్న రాహుల్...ఇప్పుడు కర్ణాటకలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గతంలో కాన్నా కాస్త అగ్రెసివ్‌గానే మాట్లాడుతున్నారు. మైసూర్‌లో భారత్ జోడో యాత్రను పున:ప్రారంభించిన రాహుల్...భారీ వర్షం పడుతున్నా...అలాగే నించుని పార్టీ కార్యకర్తలతో ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ స్పీచ్ వీడియో కాంగ్రెస్ వర్గాల్లో బాగానే వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీ కూడా తన ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేశారు. "భారత్‌ను ఏకం చేయాలనుకునే మా సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరు. భారతదేశ ప్రజల గొంతుకను వినిపించకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సాగే ఈ భారత్ జోడో యాత్రనూ ఎవరూ నిలువరించలేరు" అని రాహుల్ ట్వీట్ చేశారు.
కర్ణాటకలో యాత్ర
"బహుశా మహాత్మా గాంధీజీ స్వర్గం నుంచి కిందికి చూస్తున్నారేమో. ధైర్యంగా ముందుకు సాగిపోమని ఆశీర్వాదం ఇస్తున్నారు" అని కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ బీవీ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ వర్షంలో తడుస్తూ స్పీచ్ ఇస్తున్న ఫోటోని దీనికి యాడ్ చేశారు. సెప్టెంబర్ 7వ తేదీన భారత్ జోడో యాత్రను ప్రారంభించింది కాంగ్రెస్. కన్యాకుమారి నుంచి మొదలై...ఇప్పుడు కర్ణాటకకు చేరుకుంది. ఇప్పటికి 624 కిలోమీటర్ల మేర యాత్ర ముగిసింది. ఇవాళ పాదయాత్ర ప్రారంభించి రెండ్రోజులు బ్రేక్ తీసుకోనున్నారు రాహుల్. విజయదశమి ఉత్సవాల కారణంగా...విశ్రాంతి తీసుకుంటారు. వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరగనుండటం, రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉండటం..కాంగ్రెస్ యాత్రపై అంచనాలు పెంచుతున్నాయి. ఆదివారం రాహుల్...ఖాదీ కోఆపరేటివ్‌ను సందర్శించారు. ఆ తరవాత..పార్టీ కార్యకర్తలతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే వర్షం కురిసింది.
రాహుల్ ప్రతిజ్ఞ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ.. కర్ణాటక బందనవోలులోని ఖాదీ గ్రామోద్యోగ్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ ఓ ప్రతిజ్ఞ చేశారు. మహాత్ముడు అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారని, అదేవిధంగా తాము కూడా దేశాన్ని ఏకం చేస్తామని రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ చేశారు. భారత్ జోడో యాత్రతో ఇది సాధ్యమవుతుందని రాహుల్ అన్నారు.