హిందూ సాంప్రదాయంలో పెళ్లికి, మొదటి రాత్రికి చాలా ప్రాధాన్యత ఉంది. రెండింటికీ మంచి రోజులు చూస్తారు. అన్నీ పద్దతి ప్రకారం జరగాలని చెబుతారు పెద్దలు. అలా అనాదిగా వస్తున్న సంప్రదాయాల్లో ఒకటి మొదటి రాత్రి కుంకుమ పూలు కలిపిన పాలు వధూవరులిద్దరూ తాగడం. ఈ ఆచారం ఎందుకు అని ఎవరూ ఆలోచించి ఉండరు, కానీ ప్రాచీనకాలంలో వారు పెట్టిన ప్రతి సంప్రదాయం వెనుక ఆరోగ్యానికి సంబంధించిన ఒక కారణం కచ్చితంగా ఉంటుంది. అలాగే మొదటిరాత్రి కుంకుమ రేకలు కలిపిన పాలు తాగడం వెనుక చాలా బలమైన కారణమే ఉంది. 


గ్లాసు పాలు ఎందుకు?
వివాహం అనేది ఒక పవిత్రమైన బంధం. ఆ బంధం కలకాలం నిలవాలంటే వధూవరులిద్దరూ మరింత దగ్గరవ్వాలి. ఆ దగ్గరయ్యే పక్రియే మొదటి రాత్రి. ఆరోజున భార్యాభర్తలిద్దరూ పెళ్లి తంతుతో అలిసిపోకుండా, సత్తువతో ఉండడానికే ఈ పాలు. ఆనందకరమైన వైవాహిక జీవితానికి మొదటి రాత్రి పునాది. సంప్రదాయాల ప్రకారం, ఒక గ్లాసు కుంకుమపువ్వు పాలతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించడం వల్ల ఆ బంధం మరింత మధురంగా మారుతుందన్నది పూర్వీకుల నమ్మకం. అందుకే ఈ సంప్రదాయాన్ని పెట్టారు. 


కుంకుమపువ్వు, పాలు కలిస్తే...
పాలు బలవర్ధకమైన ఆహారం అని అందరికీ తెలుసు. అందులో కుంకుమపూలు వేయడం వల్ల ఆ రెండూ కలిపి మరింత శక్తిని ఇస్తాయి. ఇక కుంకుమ రేకలు కామోద్దీపనను కలిగిస్తాయి. పాలల్లో ఉండే ట్రిప్టోఫాన్‌తో కుంకుమ రేకలు కలిసి జీవశక్తి మెరుగుపడుతుంది. ఇది కొత్తగా పెళ్లయిన జంటలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. శాస్త్రీయంగా, కుంకుమపువ్వు గొప్ప యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉందని చాలా అధ్యయనాలు చెప్పాయి.  ఇది మానసిక స్థితిని మెరుగుపరచడానికి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో మేలు చేస్తుంది. డిప్రెషన్ కు సంబంధించిన ప్రారంభ సంకేతాలను కూడా తగ్గిస్తుంది.  


ఎప్పుడు మొదలైంది?
పురాతన గ్రంధాల ప్రకారం, కామసూత్రలో పాలు - కుంకుల పూలు కలిపిన  మిశ్రమం తాగడం ప్రస్తావన ఉంది. ఇది తాగడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుందని రాసుంది. అయితే ఒకప్పుడు ఒక గ్లాసు పాలలో సోపు రసం, తేనె, పంచదార, పసుపు, మిరియాలు, కుంకుమపువ్వు వంటి వివిధ రకాల మసాలా దినుసులు కలిపేవారు. ఇప్పుడు కేవలం పాలు - కుంకుమపువ్వు వేస్తున్నారు. కొందరైతే కేవలం పాలు మాత్రమే వినియోగిస్తున్నారు. 


Also read: మీ ముఖంలో ఈ మార్పులు వచ్చాయా? థైరాయిడ్ ఏమో చెక్ చేసుకోండి


Also read: స్వాతంత్య్ర సమరంలో స్పూర్తి రగిల్చిన గాంధీ సూక్తులు ఇవే, ఇప్పటికీ ఇవి స్పూర్తి మంత్రాలే










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.