Godavari Couple In Tirumala Video: ఆయ్.. గోదారోళ్ళు అంటే ఎటకారమే కాదండీ.. భక్తికీ, ప్రేమాభిమానాలకు పెట్టింది పేరండీ. ఊరికే మాటలు చెప్పడమే కాదండీ.. చేతలతో చూపిస్తుంటారండీ. ఇదిగో అలాంటి దంపతులే వీళ్లూ. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని వరదా వీర వెంకట సత్యనారాయణ (సత్తిబాబు) లావణ్య దంపతులు తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్లారు. గోదావరి జిల్లాల వారు అధికంగా కాలినడకనే ఏడు కొండలు ఎక్కుతామని మొక్కుకుంటారు. వీరు కూడా శ్రీవారి మెట్లపై నడిచే వెళ్లాలని మొక్కుకున్నారు.
అయితే వేగంగా మెట్లు ఎక్కుతున్న సత్తిబాబును చూసి భార్య లావణ్య సరదాగా.. ‘‘మీరు స్పీడుగా మెట్లు ఎక్కడం కాదు దమ్ముంటే నన్ను ఎత్తుకుని ఎక్కండి’’ అని సరదాగా సవాల్ చేసింది. ఆ సవాల్ ను సీరియస్ గా తీసుకున్న సత్తిబాబు భార్యను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లు ఎక్కడం మొదలు పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కారు. అలా ఆ జంట వెళ్తుంటే మిగతా తోటి భక్తులు పోటీ పడ్డారు. వెంటనే తమ సెల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీయడానికి మిగిలిన భక్తులు పోటీపడ్డారు. అందరూ వీళ్లు కొత్తగా పెళ్లైన వాళ్లేమో అని భ్రమపడ్డారు. కానీ, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
వాళ్లు, తాతయ్య, అమ్మమ్మలు కూడా అయ్యారు
పెళ్లైన కొత్తలో ఇలాంటి ప్రేమలు సర్వసాధారణమే అని కొట్టి పడేయకండి. వీరికి పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందో చెబితే ఆశ్చర్యపోవలసిందే ఎవరైనా. వీరి వివాహం 1998లో జరిగింది. అంటే ఇరవై నాలుగేళ్లు. మరో విచిత్రమైన విషయం చెప్పమంటారా! వీరికి ఇద్దరు అమ్మాయిలు. వారు ఇద్దరికీ పెళ్లిళ్లూ చేసేశారు. తాత, అమ్మమ్మలు కూడా అయిపోయారు. వీళ్ళ పెద్ద అల్లుడు గురుదత్త (చందు) మంచి సాప్ట్ వేర్ ఉద్యోగం వస్తే తన తల్లిదండ్రులను, అత్తింటి వారందరనీ తిరుమలకు తీసుకొస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారట. ఉద్యోగం రావడంతో బస్సులో నలభై మందిని తిరుపతి తీసుకెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగానే సత్తిబాబు తన భార్యను పైకెత్తుకొని ఈ సాహసం చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఎందరో యువ జంటలకు సవాలు విసురుతుంది. ఇక తొందరపడి ఈ సాహసానికి ఎవరూ ప్రయత్నించకండోయ్.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఏటా సంక్రాంతి పండుగ సమయంలో గోదావరి జిల్లాకు చెందిన వారు ఎవరో ఒకరు వార్తల్లో నిలిచే సంగతి తెలిసిందే. సంక్రాంతికి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచి వారికి రాచ మర్యాదలు చేస్తుంటారు. కనీవినీ ఎరగని రీతిలో పదులు, వందల సంఖ్యలో వంటకాలను సిద్ధం చేసి అల్లుడికి తినిపిస్తారు. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వారు కూడా తమకు ఉన్నంతలో కొత్త అల్లుడికి మర్యాదలు చేస్తుంటారు. సంక్రాంతి పండుగ సమయంలో గోదావరి జిల్లాల్లో మాత్రమే ఇలాంటి సాంప్రదాయం పెద్ద ఎత్తున కనిపిస్తుంటుంది.