థైరాయిడ్... ప్రపంచంలో సగం మంది మహిళలను ఇబ్బంది పెడుతున్న సమస్య. దీన్ని విస్మరిస్తే ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. మెడ ముందు భాగంలో ధైరాయిడ్ గ్రంధిని దెబ్బతీస్తుంది. దీన్ని తొలిరోజుల్లోనే గుర్తించడం మంచిది. ప్రారంభదశలో కొన్ని రకాల లక్షణాలు ముఖంలో కనిపిస్తాయి. కానీ అందరూ వాటిని విస్మరిస్తారు.
థైరాయిడ్ రెండు రకాలు
1. హైపర్ థైరాయిడిజం
2. హైపోథైరాయిడిజం.
హైపర్ థైరాయిడిజం ఉన్న వారిలో థైరాయిడ్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఇక హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ రెండు పరిస్థితుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటిల్లో హైపోథైరాయిడిజం అనేది రాగానే మనకు ముఖంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
హైపోథైరాయిడిజం గురించి...
మాయో క్లినిక్ ప్రకారం, హైపోథైరాయిడిజం లేదా అండర్యాక్టివ్ థైరాయిడ్ అనేది మీ థైరాయిడ్ గ్రంధి కొన్ని కీలకమైన హార్మోన్లను తగినంతగా ఉత్పత్తి చేయదు. దీన్ని చికిత్స చేయకుండా వదిలేస్తే ఊబకాయం, కీళ్ల నొప్పులు, పిల్లలు పుట్టకపోవడం, గుండె జబ్బులు వంటివి రావచ్చు.
ముఖంలో కనిపించే మార్పులు
హైపోథైరాయిడిజం ఉన్న వారిలో శరీరంలో ద్రవం పేరుకుపోతుంది. పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. అలసట, అసహనం, మానసిక ఆందోళన వంటివి కలుగుతాయి. ముఖ కవళికలలో మార్పులు కూడా హైపో థైరాయిడిజం సమస్యకు సంకేతంగా అనుకోవచ్చు.ముఖం నిస్తేజంగా మారిపోతుంది. కళ్లు, ముఖం ఉబ్బినట్టు అవుతాయి. కనురెప్పలు వంగినట్టు అవుతాయి. గొంతు బొంగురుగా మారిపోతుంది. థైరాయిడ్ హార్మోనులు తక్కువగా విడుదలవ్వడం వల్ల కనురెప్పలు రాలిపోవడం వంటివి జరుగుతాయి. కనుబొమ్మలు పలుచగా మారడం కూడా హైపోథైరాయిడిజమ్‌ను సూచిస్తుంది. జుట్టు రాలిపోతూ ఉంటుంది.
హైపోథైరాయిడిజం ఉన్న వారిలో కనిపించే ఇతర లక్షణాలు ఇవి...
- అలసట
- చలికి తట్టుకోలేకపోవడం
- మలబద్ధకం
- చర్మం పొడిబారడం
- బరువు పెరుగుట
- గొంతు బొంగురుపోవడం
- కండరాల బలహీనత
- బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం
- కండరాల నొప్పులు
- సాధారణ లేదా క్రమరహిత ఋతుస్రావం
- హృదయ స్పందన మందగించడం
- డిప్రెషన్
- జ్ఞాపకశక్తి సమస్యలు
- విస్తరించిన థైరాయిడ్ గ్రంధి (గాయిటర్)
ఈ లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఇప్పుడు చాలా మంది మహిళల్లో థైరాయిడ్ గ్రంధి పనితీరు తప్పుతోంది. కాబట్టి ప్రతి మూడు నెలలకోసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటే మంచిది.
Also read: స్వాతంత్య్ర సమరంలో స్పూర్తి రగిల్చిన గాంధీ సూక్తులు ఇవే, ఇప్పటికీ ఇవి స్పూర్తి మంత్రాలే
Also read: బ్రెడ్ పై పీనట్ బటర్ పూసుకుని తింటున్నారా? దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.