Kalotsavam: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో, తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ కళోత్సవాలు రెండో రోజు అట్టహాసంగా సాగాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన వేడుకలు రాత్రి11 గంటల వరకు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి యాంకర్ గా శ్యామల వ్యవహరించగా, వేడుకలను సినీ నటుడు ప్రకాష్ రాజ్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు విజయ, మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి - హరిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, సీపీ సత్యనారాయణ, డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ చంద్రమోహన్ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కళాకారుల సందడి..
అనంతరం కళాకారులు ఆటలు, పాటలతో తెగ సందడి చేశారు. మాట్ల తిరుపతి, ఆర్ఎస్ నంద, స్వర్ణ, పద్మావతి, కనుకవ్వ, బుర్ర సతీశ్, సౌమ్య, శాంతిరాజ్, మాలిక్ తేజ, కందుకూరి శంకర్, గడ్డం రమేశ్, పొద్దుపొడుపు శంకర్, అశ్విని రాథోడ్, నాగదుర్గ, జానులిరి, అమూల్య తదితరులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో ఇజ్రాయిల్, తమిళనాడు, పంజాబ్ కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రముఖులతోపాటు తారా ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ రాజేశ్, కళోత్సవ కమిటీ సభ్యులు రోజారమణి, మిట్టపల్లి సురేందర్, శ్రీనివాస్, ప్రవీణ్, గోగుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ గొప్పతనాన్ని చాటేలా వేడుకలు..
సెప్టెంబర్ 30వ తేదీ నాడు నుంచి ప్రారంభమైన ఈ కళోత్సవం మూడు రోజుల పాటు సాగనుంది. సన్నాహక వేడుకల్లో భాగంగా గురువారం నిర్వహించిన క్యాంప్ ఫైర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కళాకారులు పాల్గొని కొత్త ఉత్సాహాన్ని నింపారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పలు ప్రదర్శనలను సాగగా... రెండో రోజు 6 గంటల నుంచి 11 గంటల వరకు సాహా తెలంగాణ సంస్కృతి, గొప్పతనాన్ని చాటేలా ఈ వేదికను నిర్వస్తున్నారు. తార ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమాలను చేపట్టేందుకు నిర్వాహకులు అవసరమైన అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ముగింపు వేడుకలకు మంత్రి కేటీఆర్..
అక్టోబర్ 2న ముగింపు వేడుకలకు మంత్రి కేటీఆర్ వస్తారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవికి సైతం ఆహ్వానం అందినప్పటికీ ప్రస్తుతం షూటింగ్ కారణాల వల్ల మెగాస్టార్ రాలేకపోతున్నట్లు సమాచారం. ఇక నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. ముందస్తుగా గురువారం రాత్రి నిర్వహించిన ఈ వేడుకల్లో మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్,అసోం రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు సందడి చేశారు. నృత్యాలు చేస్తూ అందరిని అలరించారు. నృత్యాలు చేస్తూ ఆయా రాష్ట్రాల నుంచి గురువారం రాత్రి కళాకారులు అంబేడ్కర్ స్టేడియానికి తరలిరాగా మంత్రి గంగుల కమలాకర్ పూల మాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన క్యాంప్ ఫైర్ వద్ద ఇజ్రాయిల్ తో సహా పలు రాష్ట్రాల కళాకారులు పాటలతో అలరించారు. కళోత్సవాల సందర్భంగా కార్యక్రమాలను వీక్షించేందుకు వచ్చిన వారికి ఒకవేళ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అవసరమైనా ట్రీట్మెంట్ అందించడానికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో పార్కింగ్ తో సహా భద్రత ఏర్పాట్లను సైతం కట్టుదిట్టంగా చేశారు.