ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ఎంత జీతం వస్తుందో అంచనా వేయగలం, పోస్టుని బట్టి గవర్నమెంట్ ఉద్యోగి జీతాన్ని కూడా చెప్పగలం కానీ చాలా మందికి తెలియని విషయం మోడలింగ్ రంగంలో ఉన్న వారి జీతాలు. వారు ఏడాదికి ఎంత సంపాదిస్తారు? అనేది ఎంతో మందికి ఉన్న సందేహం. మోడలింగ్ ఉద్యోగాలు మనదేశంలో బాగానే ఉన్నాయి. కాకపోతే బాలీవుడ్ సెలెబ్రిటీలే మోడల్స్ లాగా వ్యవహరిస్తుండడంతో మోడలింగ్‌నే ఉద్యోగంగా ఎంచుకున్న వారికి కాస్త దెబ్బ పడుతోంది. 


మోడల్స్ ఏం చేస్తారు?
దుస్తుల బ్రాండ్ కంపెనీలు తమ వస్త్రాలను చక్కటి మోడల్‌కు వేసి ఫోటోలు తీస్తారు. వాటినే ప్రమోషన్‌కు వాడతారు. అలాగే టీవీల్లో కనిపించే చాలా ప్రకటనల్లో మోడల్స్ కనిపిస్తారు. ముఖ్యంగా ప్రముఖ డిజైనర్‌ల దుస్తులను ప్రదర్శించేందుకు అంతర్జాతీయ వేదికలపై ర్యాంప్ వాక్ చేస్తారు. మన దేశంలో ఎన్నో మోడలింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటి ద్వారానే డిజైనర్లు, షో నిర్వాహకులు మోడల్స్‌ను ఎంపిక చేసుకుంటారు. 


జీతాలు ఎంత?
మోడల్స్‌లో ఆడా, మగా ఇద్దరూ ఉన్నారు. ఒక బ్రాండ్ ఏడాది పాటూ వారితో కాంట్రాక్ట్ రాయించుకుంటుంది. అలాంటప్పుడు ఏడాదికి వారికి జీతాలను చెల్లిస్తారు. పురుష మోడల్ కు రూ.30 లక్షల రూపాయలు చెల్లిస్తే, మహిళా మోడల్స్ కు రూ.40 లక్షల దాకా చెల్లించే అవకాశం ఉంది. ఈ మొత్తం ఐఐటీ, ఐఐఎం వంటి ప్రముఖ సంస్థల్లో చదువుకున్న వారి వార్షిక జీతం కంటే ఎక్కువనే చెప్పాలి. ఆ సంస్థల్లోని ఫ్రెషర్లకు ఏడాదికి తొలి జీతం పాతిక లక్షల రూపాయల దాకా ఉంటుంది.  


ప్రకటనల ద్వారా...
ఢిల్లీకి చెందిన ఓ మోడలింగ్ ఏజెన్సీ వారు మాట్లాడుతూ పురుష మోడల్స్ వాణిజ్య ప్రకటనలు, డిజైనర్ షూట్లలో పాల్గొనడం ద్వారా నెలకు రెండు నుంచి రెండున్నర లక్షల దాకా సంపాదిస్తారని తెలిపారు. అదే మహిళలైతే మూడు లక్షల రూపాయల నుంచి మూడున్నర దాకా పొందుతారని వివరించారు. డిజైనర్ షూట్‌లు అంటే ఏదైనా డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులివ్వడమన్నమాట. అలా ఇచ్చినందుకు ఒక్కో షూట్‌కు 30 నుంచి 35 వేల రూపాయలు సంపాదిస్తారు. నెలలో 20 షూట్లలో పాల్గొనే టాప్ మోడల్స్ ఉన్నారు. జీఎస్టీ పోగా వీరికి నెలకు అయిదారు లక్షల దాకా మిగులుతుందట.  అదే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తే రోజుకు ఎనభై వేల రూపాయల నుంచి లక్ష దాకా తీసుకుంటారు. కొంతమంది రెండు లక్షలు కూడా డిమాండ్ చేస్తారు. 


ర్యాంప్ వాక్ చేసినందుకు...
ఇక ర్యాంప్ వాక్ చేసినందుకు అంటే  డిజైనర్ దుస్తులు ధరించి క్యాట్ వాక్ చేసుకుంటూ రన్ వే పై నడిచినందుకు పురుష మోడల్స్ ఏడు వేల నుంచి 10 వేల రూపాయల దాకా సంపాదిస్తారు. అదే అమ్మాయిలైతే 15 వేల నుంచి 20 వేల రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. 


వీరే టాప్
బాలీవుడ్ సెటెబ్రిటీలను పక్కన పెడితే మనదేశంలో టాప్ మోడల్స్ వీళ్లే. రికీ ఛటర్జీ, సోనాలికా, సహాయ్, లక్ష్మీ రాణా, అర్చన అఖిల్ కుమార్ వంటి వారు మహిళా మోడల్స్ గా రాణిస్తున్నారు. ఇక మగవారిలో వివేక్ ధిమాన్, బర్దీప్ ధిమాన్, నితిన్ గుప్తా, గౌరవ్ చౌదరి, వైభవ్ ఆనంద్ ఉన్నారు. 


Also read: డయాబెటిక్ రోగులు ఈ అలవాట్లు వదిలేయాల్సిందే, లేకుంటే అవి క్యాన్సర్ కారకాలుగా మారవచ్చు


Also read: బ్యాటరీ కనిపిస్తే మింగేస్తుంది, పొట్టలో 55 బ్యాటరీలు, ఇదో విచిత్ర మానసిక సమస్య