Diabetes: ప్రపంచంలో అత్యధికులను ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య డయాబెటిస్. వారు జాగ్రత్తగా ఉండకపోతే మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని అలవాట్లు వదలకపోతే ప్రాణాంతకమైన సమస్యలు కూడా రావచ్చు. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువని చెబుతోంది తాజా అధ్యయనం. అందుకేు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 


ఇదే సమస్య...
టైప్ 2 డయాబెటిస్ (T2D) ఉన్న వారిలో శరీర కణాలు ఆహారం నుంచి ఇన్సులిన్‌ను గ్రహించలేవు. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో పెరిగిపోతాయి. దీని వల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. వీరు జాగ్రత్తగా ఉండకపోతే గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, స్ట్రోక్ వంటివి కలుగుతాయి. అంతేకాదు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.కొత్త అధ్యయనం ప్రకారం కొన్ని అలవాట్లు ఉన్న డయాబెటిక్ రోగులు ప్రాణాలంతక రోగాల బారిన త్వరగా పడతారు. అంతేకాదు అవి అకాల మరణానికి కూడా దారితీయవచ్చు. 


డెన్మార్క్, స్వీడన్‌ కు చెందిన శాస్త్రవేత్తలు  రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్‌ డయాబెటిస్ రోగులకు వచ్చే అవకాశంపై అధ్యయనం చేశారు. దీనిలో 1998-2019 మధ్య స్వీడిష్ నేషనల్ డయాబెటిస్ రిజిస్టర్‌లో టైప్ 2 డయాబెటిస్ ఉన్న 655,344 మంది వ్యక్తులు ఉన్నారు. వారి వయసు సగటు వయసు 63 ఏళ్లు. వారిలో 43 శాతం మంది మహిళలు. ఏడేళ్ల పాటూ సుదీర్ఘంగా వీరిని అధ్యయనం చేశారు. వీరంతా క్యాన్సర్ లేని వారే. అయితే ఈ ఏడేల్ల కాలంలో వారిలో 32,366 మందికి క్యాన్సర్ సోకింది. అలాగే అధ్యయనంలో పాల్గొన్న వారిలో 1,79,627 మంది అధ్యయన సమయంలోనే మరణించారు. వీరందరి ఆరోగ్య డేటాను పరిశీలించారు అధ్యయన కర్తలు. 


ఇవే కారకాలు...
చనిపోయిన వారందరిలోనూ కొన్ని ప్రత్యేక కారకాలు ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం, ఊబకాయం, అధిక రక్తపోటు కలిగి ఉండడం, రక్తంలోని హిమోగ్లోబిన్లో అధిక చక్కెర ఉండడం వంటివి గమనించారు. ఇవన్నీ కొన్ని చెడు అలవాట్ల వల్ల వస్తాయి. వాటిని వదులకుంటే మంచిది.


ఆ అలవాట్లు ఇవే...
వ్యాయామం చేయకుండా గంటల కొద్దీ ఇంట్లో కూర్చోవడం వల్ల చాలా ప్రమాదం. మధుమేహం ఉన్న వారు కచ్చితంగా వ్యాయామాలు చేయాలి. ఇలా వ్యాయామాలు చేయకపోవడమనేది మధుమేహంతో, క్యాన్సర్ తో ముడిపడి ఉంది. అలాగే ధూమపానం అలవాటు ఉన్న డయాబెటిక్ రోగులు కూడా క్యాన్సర్ బారిన పడవచ్చు. ధూమపానం చేసే మధుమేహులు త్వరగా మరణించే అవకాశం రెండు రెట్లు అధికం. అలాగే శారీరక శ్రమ లేని వారు మరణించే అవకాశం ఒకటిన్నర రెట్లు ఎక్కువ. అలాగే జంక్ ఫుడ్ అధికంగా తినడం, ఆరోగ్యకరమైన ఆహారాలు తినకపోవడం కూడా మధుమేహుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. 


Also read: బ్యాటరీ కనిపిస్తే మింగేస్తుంది, పొట్టలో 55 బ్యాటరీలు, ఇదో విచిత్ర మానసిక సమస్య


Also read: రోజుకో కప్పు కాఫీ తాగితే అకాల మరణ ప్రమాదం తగ్గుతుందా? జీవితకాలం పెరుగుతుందా?