Konaseema Water Dogs: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నీటి కుక్కలు కోనసీమ కాలువలలో హల్ చల్ చేశాయి. సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లోని మడ అడవుల్లోనూ కనిపించే నీటి కుక్కలు కోనసీమ పంట కాలువలలో సందడి చేశాయి. అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి గ్రామ పరిధిలోని ప్రధాన పంట కాలవలో నాలుగు నీటి కుక్కలు కలియతిరిగాయి. భారీ వర్షాలు, వరదలతో కనిపించిన నీటి కుక్కలను చూసిన స్థానికులు వాటిని చూసేందుకు ఎగబడ్డారు.
ఇందుపల్లి గ్రామంలో నీటి కుక్కలు..
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇందుపల్లి గ్రామంలోని పంట కాలువలో ఆరు నీటి కుక్కలు కనువిందు చేశాయి. అవి సమీప ప్రాంతంలోనే తిరుగుతుండడంతో స్థానిక ప్రజలు మొదట భయాందోళనలు వ్యక్తం చేశారు. అయితే విషయం తెలుసుకున్న సమీప గ్రామాల వారు నీటి కుక్కలను వీక్షించేందుకు పంట కాలువ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ఫొటోలు, వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో కోనసీమకు వరదలు ముంచెత్తడంతో ఇవి ఏదైనా అటవీ ప్రాంతం నుంచి గాని లేదా మడ అడవుల ప్రాంతం నుంచి గాని ఇక్కడకు వచ్చినట్లు భావిస్తున్నారు. వాటి దంతాలు చాలా పెద్దవిగా ఉన్నాయని, అవి కరిస్తే ఇక అంతే అంటూ స్థానికులు వాటి గురించి స్పందించారు. నీటి కుక్కల సంచారం పై అటవీ శాఖ అధికారులకు స్థానిక ప్రజలు సమాచారం అందించారు.
2018 సెప్టెంబర్ నెలలో శ్రీశైలం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో నీటి కుక్కలు సందడి చేశాయి. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతంలో గత ఏడాది జూలై నెలలో నీటి కుక్కలు కనిపించాయి.
జనవరిలో నీటికుక్కల హల్ చల్..
దక్షిణకన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా ముండాజె గ్రామం వద్ద నేత్రావతి నదిలో ఈ ఏడాది జనవరి నెలలో నీటి కుక్కలు కనిపించాయి. కల్మంజ గ్రామం నుంచి పజిరడ్క దాకా సుమారు 3 కిలోమీటర్ల వరకు నదిలో నీటి కుక్కలు సంచరించాయి. ఈ ఏడాది భారీగా వర్షాలు కురవడంతో నేత్రావతి నది సుమారు మూడునెలలకు పైగానే ప్రవహించింది. వర్షపు నీటి ప్రభావం తగ్గిన అనంతరం నీటికుక్కలు నదిలో సంచరించాయిని స్థానికులు తెలిపారు. పదికి పైగా నీటికుక్కలు ఒకేసారి కనిపించి స్థానికులకు కనువిందు చేశాయి. 2021లో మే నెలలో గర్డాడి గ్రామ పరిధిలో ఫల్గుణ నదిలో భారీ సంఖ్యలో పైగా నీటి కుక్కలు కనిపించాయి. దాదాపు 25 వరకు నీటికుక్కలు కనిపించడంతో స్థానికులకు కనులవిందు అయింది. ఆ నీటి కుక్కలు చేపలు, పీతలను ఆహారంగా తీసుకుంటాయి. వరదలు, నీటి ప్రవాహాలు తగ్గిన సమయంలో కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో నీటి కుక్కలు కనిపిస్తుంటాయి.
నీటి కుక్క.. ఇది ఓ రకమైన ఉభయచరాలైన క్షీరదాలు. వీటిలోని 7 ప్రజాతులు, 13 జాతులు ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయి. వీటి ముఖ్యమైన ఆహారం చేపలు అని నిపుణులు చెబుతున్నారు. ఇవి ముఖ్యంగా కర్ణాటకలోని బళ్లారి, విజయనగర, కొప్పళ జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలోని నీటి కుక్కల (Otters) వీక్షణకు నదీ తీరంలో అటవీశాఖ అధికారులు వాచ్‌టవర్ల నిర్మాణానికి 2022 ఫిబ్రవరిలో సన్నాహాలు ప్రారంభించారు. తుంగభద్ర జలాశయం నుంచి కంప్లి వరకూ సుమారు 30 కిలోమీటర్ల నదితీరాన్ని అటవీశాఖ నీటికుక్కల సంరక్షణ ప్రాంతంగా ఆ ప్రభుత్వం ప్రకటించింది.