మట్టి పాత్రలతో మన బంధం ఈనాటిది కాదు. ఆదిమ మానవుడి మొదటి వంట గిన్నెలు అవే. ఇప్పటికీ గ్రామాల్లో కొన్ని చోట్ల మట్టి కుండల్లోనే అన్నం వండుతారు. ఆధునిక కాలంలో వచ్చిన అల్యూమినియం, స్టీలు, ఇనుము పాత్రలతో పోలిస్తే మట్టి పాత్రలు ఎంతో మేలైనవి. వేసవిలో చాలా మంది ఫ్రిజ్ లోని నీళ్లు తాగేందుకు ఇష్టపడతారు. నిజానికి ఫ్రిజ్లోని వాటర్ వల్ల సమస్యలే తప్ప ఒనగూరే ఆరోగ్యం ఏమీ ఉండదు. అదే మట్టి కుండలో నీళ్లు తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేద నిపుణులు కూడా మట్టికుండలో నీళ్లే ఉత్తమమైనవని, కొన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయని అంటున్నారు.
జీర్ణ ప్రక్రియ సక్రమంగా...
జీర్ణక్రియ సక్రమంగా సాగితేనే మన ఆహారం మంచిగా జీర్ణమైన శక్తిగా మారి శరీరానికి అందుతుంది. మట్టి కుండలోని నీరు జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరం తాలూకు సహజ జీవక్రియ వ్యవస్థ మట్టి కుండలో నిల్వ ఉన్న నీటితో వృద్ధి చెందుతుంది.
ఈ చలువే మేలు
ఫ్రిజ్ లో నీళ్లు చల్లగా ఉంటాయి. వేసవిలో తాగితే హాయిగా ఉంటుంది. నిజానికి కుండలో చల్లబడిన నీళ్లు మాత్రమే సరైన ఉష్ణోగ్రత స్థాయిలను కలిగి ఉంటాయి. కుండ నీటిని సరిగ్గా హైడ్రేట్ చేస్తుంది. శీతలీకరణ ప్రభావాన్ని ఇస్తుంది. గొంతుపై సున్నితంగా ఉంటుంది.
వడదెబ్బను నివారిస్తుంది
వేసవిలో రోజూ కుండ నీళ్లు తాగే వారికి వడదెబ్బ కొట్టదు. ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. కుండలో నీళ్ల వల్ల దాహం కూడా తీరుతుంది. పొట్టకు హాయిగా ఉంటుంది.
టాక్సిన్లు ఉండవు
కుండలో నీళ్ల వల్ల అతి పెద్ద ప్రయోజనం ఇది. ఈ నీళ్లలో ప్రమాదకరమైన టాక్సిన్లు చేరే అవకాశం చాలా తక్కువ. ఫ్రిజ్ నీళ్లలో ఒక్కోసారి ఎంతో కొంత టాక్సిన్లు ఉండొచ్చు. అదే కుండ నీళ్లు వంద శాతం సేఫ్.
ఎసిడిటీ దూరం
మట్టి కుండలలో నిల్వ ఉంచిన నీళ్లు తాగడం వల్ల ఎసిడిటీ వంటి సమస్యలు ఉత్పన్నం కావు. అందుకే పూర్వ కాలపు మనుషులు పూర్తిగా కుండ నీళ్లపైనే ఆధారపడే వాళ్లు. గ్యాస్టిక్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడే వాళ్లు కుండ నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే వాటి నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు.
Also read: అబ్బాయిలు జర జాగ్రత్త, వీటిని తింటే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది
Also read: పొలమారితే ‘ఎవరో తలచుకోవడం’ కాదు, గొంతులో జరిగేది ఇది