శరీర ఆరోగ్యంలో మంచి ఆహారానిదే కీలక పాత్ర. ఆధునిక కాలంలో ఆహారంతో పాటూ ఇంకా ఎన్నో అంశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఒత్తిడి, మానసిక భావోద్వేగాలు వంటివి కూడా కీలకంగా ప్రవర్తిస్తాయి.మగవారి లైంగిక శక్తిపై ఇవన్నీ తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. కొన్ని రకాల ఆహారాలు అధికంగా తీసుకోవడం వల్ల వారిలో పునరుత్పత్తి వ్యవస్థపై చాలా ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆహారాలను దూరం పెడితే ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. 


పాదరసం నిండిన చేపలు
సముద్ర జలాలు,నదీ జలాలు ప్లాస్టిక్ వంటి వ్యర్థాలతో నిండిపోయి కలుషితం అయిపోయాయి. దీని వల్ల కొన్ని రకాల చేపల్లో పాదరసం శాతం అధికంగా ఉంటోంది. ముఖ్యంగా టూనా, టైల్ ఫిష్, కత్తి ముక్కు చేప వంటి వాటిల్లో పాదరసం అధికంగా పేరుకుంటోంది. వీటిని తినడం వల్ల పాదరసం శరీరంలో చేరి అనేక సమస్యలకు కారణం అవుతుంది. అందులోనూ మగవారిలో సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తోంది. కాబట్టి వీటిని తినడం చాలా తగ్గించడం మంచిది. 


కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు
కొంత కొవ్వు మన శరీరానికి అవసరమే కానీ అధికంగా కొవ్వు ఉన్న పదార్థాలు తింటే ప్రమాదం తప్పదు. అధిక కొవ్వు ఉన్న పదార్థాలు, పాల ఉత్పత్తులు శరీరానికి హాని కలిగిస్తాయి. పురుషు పునరుత్పత్తి వ్యవస్థను నాశనం చేస్తాయి. పాల కొవ్వులలో ఆవుల కోసం అందించిన మందుల అవశేషాలు కూడా ఉండొచ్చు. ఇది మగవారి పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయి. 


క్యాన్డ్ ఫుడ్
క్యాన్లలో, టిన్లలో స్టోర్ చేసే అమ్మే ఆహారాలను తినకపోవడమే మంచిది. ఇలాంటి క్యాన్డ్ ఆహారాలు బిస్ఫినాల్ అనే సమ్మేళనంతో ప్యాక్ చేస్తారు. ఇది మగవారి టెస్టోస్టెరాన్ స్థాయిలకు అంతరాయం కలిగిస్తుంది. అందుకే క్యాన్డ్ ఆహారాలను చాలా వరకు తినకపోతేనే మంచిది. 


ట్రాన్స్ ఫ్యాట్స్
ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఆహారాన్ని తినడం మానేయాలి. కాల్చిన, నూనెలో బాగా వేయించిన ఆహారాలు, కేకులు, కుకీలు, బిస్కెట్లు, ఫ్రైంచ్ ఫ్రైస్ వంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. ఊబకాయం మగవారిలో సంతానోత్పత్తి సమస్యలకు కారణం అవుతుంది. 


ఆల్కహాల్
ఆల్కహాల్ తీసుకోవడం అన్ని రకాలుగా అనారోగ్యానికి గురిచేస్తుంది. ప్రధాన అవయవాలన్నింటికీ హాని చేస్తుంది. పురుషుల్లో తీవ్రమైన సంతానోత్పత్తి సమస్యలకు కారణం అవుతుంది. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గించడం, అంగస్థంభన వంటి సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి అతిగా తాగడం మానితే మంచిది. 


ప్రాసెస్డ్ ఫుడ్
అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం ఎవరికీ మంచిది కాదు. ముఖ్యంగా ప్రాసెస్డ్ మాంసాహారాన్ని మానాలి. అప్పటికప్పుడు తాజాగా ఉన్నది తెచ్చుకుని వండుకుని తింటే మంచిది. ప్రాసెస్ చేసి నిల్వ చేసిన ఆహారాలు పురుషులలో వీర్యకణాల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. 


కూల్ డ్రింకులు
ఎనర్జీ డ్రింకులు, కూల్ డ్రింకులుగా పిలుచుకునే కార్బోనేటెడ్ డ్రింకులను అతిగా తాగుతుంటారు చాలా మంది. అందులో అధిక చక్కెర కంటెంట్‌ నింపి ఉంటుంది. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. ఈ పరిస్థితి వల్ల సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. 


Also read: పొలమారితే ‘ఎవరో తలచుకోవడం’ కాదు, గొంతులో జరిగేది ఇది


Also read: హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరంగా పెట్టాల్సిందే