ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసీఆర్, జగన్‌ల మద్య సఖ్యత బాహ్యప్రపంచానికి బహిర్గతమైంది. అయితే రాష్ట్రాల మద్య విభేదాలు నెలకొనప్పటికీ ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రం ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి లేదు. అయితే ఖమ్మంకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ తరుచూ ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా ప్రత్యక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం దుమారం లేపుతున్నాయి. గతంలో కృష్ణా జలాల విషయంలో కానీ, ప్రస్తుతం దావోస్ పర్యటన నేపథ్యంలో పువ్వాడ చేస్తున్న వ్యాఖ్యలు ఆంధ్రాలో వైరల్‌గా మారుతున్నాయి.
కృష్ణా జలాల విషయంలో..
రాష్ట్ర విభజన అనంతరం ఏడేళ్ల నుంచి కృష్ణా జలాల పంపిణీ విషయం వివాదంగానే మారింది. అయితే రెండేళ్ల క్రితం ఈ విషయంపై వివాదం చెలరేగడంతో పువ్వాడ అజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఏకంగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిపైనే వ్యాఖ్యలు చేశారు. వై.ఎస్.జగన్‌ను గజదొంగ అని వ్యాఖ్యానించడం ఏడాది క్రితం దుమారం లేపాయి. ఆ విషయం కాస్తా సద్దుమణిగింది. రాష్ట్రాలకు సంబందించిన విషయం కావడంతో రాజకీయంగా మాత్రమే ఇవి చర్చగా మారాయి. ఇవి కాకుండా ఇటీవల కాలంలో తన సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమానికి వెళ్లిన పువ్వాడ అజయ్ అక్కడ కూడా జగన్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. కమ్మ సామాజిక వర్గానికి ఏపీలో ప్రాధాన్యం లేదని, ఉన్న ఒక్క మంత్రిని అక్కడ తొలగించారని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పటికే ఏపీలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య సాగుతున్న రాజకీయ విభేదాల నేపథ్యంలో పువ్వాడ అజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాలలో సంచలనంగా మారాయి.
పెట్టుబడులు లేక ఈగలు కొట్టుకుంటుంది ఎవరు..?
ఇటీవల ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైరల్‌గా మారాయి. మంత్రి కేటీఆర్ దావోస్‌లో పర్యటన చేస్తుండగా పెట్టుబడుల వర్షం కురుస్తుందని, పక్క రాష్ట్రం వాళ్లు వెళితే ఈగలు కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇద్దరు పెట్టుబడుల సమీకరణ కోసం దావోస్‌లో పర్యటించడం, మంత్రి పువ్వాడ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వరుసగా ఏపీపై గురిపెట్టి మంత్రి పువ్వాడ చేస్తున్న వ్యాఖ్యల మర్మం మాత్రం రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టడం లేదు. ఓ వైపు కేసీఆర్, కేటీఆర్ జగన్‌తో సఖ్యతగా ఉంటూ మంత్రి పువ్వాడ ద్వారా వ్యాఖ్యలు చేయిస్తున్నారా? లేక సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఖమ్మం జిల్లాపై ఆంధ్రా ప్రభావం ఉండకుండా చేసేందుకు మంత్రి పువ్వాడ అజయ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా..? అనే విషయంపై చర్చ సాగుతుంది. కాగా అసలు పువ్వాడ అజయ్ రాజకీయ ప్రస్థానం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీతో మొదలు కావడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ వరుసగా మంత్రి పువ్వాడ తరుచూ ఏపీపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి.
Khammam: సీఎం జగన్‌పై తెలంగాణ మంత్రి వ్యాఖ్యల దుమారం! అదే పనిగా విమర్శలు, అందులో ఆంతర్యంటి?
ABP Desam
Updated at:
26 May 2022 09:41 AM (IST)
Minister Puvvada Ajay Kumar: మంత్రి పువ్వాడ అజయ్ తరుచూ ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా ప్రత్యక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం దుమారం లేపుతున్నాయి.
జగన్, పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్ ఫోటోలు)
NEXT
PREV
Published at:
26 May 2022 10:17 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -