థైరాయిడ్ వ్యాధి ఎక్కువ మందిలో కనిపిస్తున్న రుగ్మత. థైరాయిడ్ గ్రంథి మన శరీరంలోని ముఖ్యమైన ఎండోక్రైన్ గ్రంథులలో ఒకటి. దీన్నుంచి థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. మన రోజువారీ జీవనానికి ఆ హార్మోన్లు చాలా అవసరం. కానీ అతిగా హార్మోన్లు విడుదల కావడం, లేదా అతి తక్కువగా హార్మోన్లు విడుదల చేయడం... ఈ రెండూ సమస్యలే. థైరాయిడ్ గ్రంథి సాధారణం కన్నా అతి హార్మోన్లు విడుదల చేస్తే దాన్ని హైపర్  థైరాయిడిజం అంటారు. అదే తక్కువగా ఉత్పత్తి చేస్తే హైపో థైరాయిడిజం అని పిలుస్తారు. 


లక్షణాలు ఇలా ఉంటాయి...
థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయకపోతే కింద చెప్పని లక్షణాలు కనిపిస్తాయి. 
1. థైరాయిడ్ గ్రంధి ఉన్న మెడ ప్రాంతంలో వాపు కనిపిస్తుంది. 
2. త్వరగా అలసిపోవడం, నీరసించి పోవడం జరుగుతుంది. 
3. లైంగికాసక్తి తగ్గిపోతుంది. లైంగిక కోరికలు సరిగా రావు. 
4. చర్మం పొడిగా మారిపోతుంది. 
5. బరువు పెరిగిపోవడం లేదా తగ్గిపోవడం జరుగుతుంది. 
6. నెలసరి సరిగా రాదు. సమయం దాటి పోవడం, ఒక్కో నెల రాకపోవడం జరుగుతుంది. 
7. మలబద్ధకం సమస్య కూడా మొదలవుతుంది. 


ఏం తినకూడదంటే...
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ఆహార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 


కెఫీన్ 
కాఫీ వంటి పానీయాలను చాలా తగ్గించాలి. హైపర్ థైరాయిడిజం బారిన పడిన వారిలో కెఫీన్ దడను పెంచుతుంది. హైపర్ థైరాయిడిజంలో గ్రంధి అతిగా హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అంటే అవసరానికి మించి చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి శరీరాన్ని మరీ ఉత్తేజబరిచే ఆహారాలు, ఎనర్జీడ్రింక్స్ వంటికి దూరంగా ఉండాలి. 


మద్యపానం
ఆల్కహాల్ డీహైడ్రేషన్‌కు కారణం అవుతుంది. నిద్ర సమస్యలు వంటివి హైపర్ థైరాయిడిజం లక్షణాలు పెంచుతుంది. ఇది థైరాయిడ్ రోగులలో బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. 


చక్కెర
థైరాయిడ్ రోగులు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. చక్కెర ఉన్న పదార్థాలు తినడం తగ్గించాలి. లేకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. 


అయోడిన్ ఆహారాలు
అయోడిన్ ఆహారాలను కూడా తగ్గించుకోవాలి. అయోడిన్ థైరాయిడ్ గ్రంధిని అధికంగా పనిచేసేలా చేస్తుంది. దీని వల్ల మరింతగా హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. 


వెన్న తీయని పాలు
వెన్న తీయని పాలలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఈ పాలను తాగితే థైరాయిడ్ లక్షణాలు తీవ్రంగా మారుతాయి. కాబట్టి వెన్న తీసిన పాలను తాగితే మంచిది. 


Also read: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది


Also read: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే