పిల్లల మెదడు ఎదుగుదల పుట్టినప్పట్నించి అయిదేళ్ల వరకు వేగంగా సాగుతుంది. వారి జీవితంలో మొదటి ఎనిమిదేళ్లు చాలా ముఖ్యమైనవని చెబుతారు వైద్యులు. ఆ వయసు వరకు వారు నేర్చుకున్న అంశాలు, ఆరోగ్యం కూడా భవిష్యత్తుపై చాలా ప్రభావాన్ని చూపుతాయని అంటారు. వారి మెదుడు ఎదుగుదల సక్రమంగా ఉండి, చక్కగా పనిచేయాలంటే ఆ వయసులో వారికి చక్కటి ఆహారాన్ని తినిపించాల్సిన అవసరం ఉంది. ‘బ్రెయిన్ ఫుడ్’గా చెప్పుకునే కొన్ని రకాల ఆహారాలు పిల్లల మెదడుపై ప్రభావాన్ని చూసిస్తాయి. ఎదుగుదలను సహకరించడంతో పాటూ జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కాబట్టి ఈ ఆహారాలను తరచూ తినిపించాలి. వీటిల్లో కనీసం ఒకటి లేదా రెండైనా రోజూ తినేలా చూస్తే మంచిది. 


చేపలు (ఫ్యాటీ)
కొన్ని రకాల చేపలు కొవ్వు పట్టి ఉంటాయి. ఆ కొవ్వులోనే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు పరిపక్వతకు చాలా అవసరం. సాల్మన్, సార్టయిన్స్, మాకెరెల్ వంటి చేపల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. 


గుడ్లు
కోడిగుడ్లు ఆరోగ్యకరమైన ఆహారం ముందుంటాయి. కొలిన్ అని పిలిచే పోషకం ఇందులో లభిస్తుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమ్మేషన్ కలగడాన్ని నిరోధిస్తుంది. మెదుడు చక్కగా పనిచేసేలా చేస్తుంది. 


ఆకుపచ్చని కూరగాయలు
బీన్స్, బ్రకోలి, క్యాబేజి, పచ్చి బఠాణీ ఇలా ఆకుపచ్చని రంగులో ఉండే కూరగాయలను తినడం చాలా ముఖ్యం. వీటిలో మెదడుకు అవసరమయ్యే విటమిన్ కె, బీటాకెరాటిన్, ఫోలేట్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. 


నట్స్, సీడ్స్
గింజ జాతివన్ని వీటి కిందకి వస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పులు, సన్ ఫ్లవర్ సీడ్స్, ఖర్జూరం, పిస్తా, జీడిపప్పులు వంటివి రోజుకో గుప్పెడైనా తినిపించాలి. 


ఓట్స్
శరీరానికి, మెదడుకు అత్యవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి ఓట్స్. వీటిని తినిపిస్తే పిల్లలు రోజంతా చురుగ్గా ఉంటారు. మెదడు ఫంక్షనింగ్ కూడా బావుంటుంది. 


క్వినోవా, బార్లీ
ఓట్స్ మాత్రమే కాదు బార్లీ గింజలతో చేసే వంటలు, క్వినోవా వంటివి కూడా ప్రతి రెండు మూడు రోజులకోసారి వండి పెడుతూ ఉండాలి. వీటిలో ఫైబర్, బి విటమిన్ లభిస్తుంది. ఇవి మెదడులో ఇన్ఫ్లమ్మేషన్ లక్షణాలను తగ్గిస్తుంది. 


బెర్రీ పండ్లు
పండ్లన్నీ మంచివే. కానీ మెదడుకు అతిగా మేలు చేసేవి బెర్రీ జాతి పండ్లు. బెర్రీ పండ్ల రకాలు తరచూ తినడం వల్ల  మెమోరీ లాస్ వచ్చే అవకాశం చాలా తక్కువ.  


Also read: స్లీపింగ్ పిల్స్ అధికంగా వాడుతున్నారా? వాటి వల్ల కలిగే నష్టాలు ఇవే


Also read: ఒక ప్లాస్టిక్ బకెట్ ఇరవై ఆరువేల రూపాయలా? అది కూడా ‘సోల్డ్ అవుట్’