తెలంగాణలో పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, అగ్నిమాపకశాఖల్లో ఖాళీల భర్తీకి కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆ పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. గురువారం (మే 26) రాత్రి 10 గంటల వరకు దీనికి చేసుకునే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా యూనిఫారం సర్వీసుల్లోని అన్ని విభాగాల్లో కలిపి 17,516 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న దరఖాస్తు గడువు ముగిసింది.
అయితే, అభ్యర్థుల కోరిక మేరకు ప్రభుత్వం మరో రెండేళ్లు వయోపరిమితి పెంచారు. అందుకని, దరఖాస్తుకు గడువు తేదీని ఈ నెల 26 వరకు పొడిగించారు. ఇప్పటివరకు 13 లక్షల దరఖాస్తులు వచ్చాయని, చివరి రోజుకావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. యూనిఫాం ఉద్యోగాల భర్తీకి ఈ నెల 2 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడం, రెండేళ్ల పాటు కరోనా కారణంగా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఆ మేరకే నేటి వరకూ గడువును పొడిగించారు.