IPL 2022 lsg vs rcb eliminator top five mistakes of kl rahuls lucknow supergiants: ఐపీఎల్‌ 2022 ట్రోఫీ బరిలో మిగిలింది 3 జట్లే. ఎలిమినేటర్లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG) నాకౌట్‌ అయింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) వారిని 14 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్‌ 2కు వెళ్లిపోయింది. దాదాపుగా లక్నో చేతుల్లోకి వచ్చిన మ్యాచును స్వీయ తప్పిదాలే ముంచేశాయి. మరి ఎలిమినేటర్లో వారు చేసిన తప్పులేంటి? అవెలా కొంప ముంచాయో చూసేద్దాం!!


క్యాచ్‌ డ్రాప్‌.. మ్యాచ్‌ డ్రాప్‌


క్యాచులే మ్యాచులను గెలిపిస్తాయి! ఇదెంత నిజమో ఎలిమినేటర్లో మరోసారి తేలిపోయింది. సెంచరీ కుర్రాడు రజత్‌ పాటిదార్‌కు ఏకంగా మూడు జీవనదానాలు వచ్చాయి. 12.5వ బంతికి ఒకసారి అతడి క్యాచ్‌ డ్రాప్‌ అయింది. 15.3 బంతికి లాలీపాప్‌ క్యాచ్‌ను దీపక్‌హుడా వదిలేశాడు. 14.5 బంతికి దినేశ్‌ కార్తీక్‌ క్యాచ్‌ను అందుకున్నట్టే అందుకొని కేఎల్‌ రాహుల్‌ నేలపాలు చేశాడు. వీరిద్దరే ఆ జట్టు స్కోరును 200 దాటించారు. ఆ క్యాచులు అందుకొని ఉంటే ఆర్సీబీ 180 లోపే పరిమితం అయ్యేది.


చెత్త బౌలింగ్‌.. హోల్డర్‌ ఎక్కడ!


ఈ మ్యాచులో లక్నో చేసిన అతిపెద్ద బ్లండర్‌ జేసన్‌ హోల్డర్‌ను పక్కన పెట్టేయడం! నిజానికి డెత్‌ ఓవర్లు వేయడంలో అతడు స్పెషలిస్టు. బ్యాటుతోనూ సిక్సర్లు కొట్టగలడు. ఫీల్డింగ్‌ బాగుంటుంది. అతడి స్థానంలో తీసుకున్న దుష్మంత చమీరా 4 ఓవర్లలో 13.50 ఎకానమీతో 54 రన్స్‌ ఇచ్చాడు. గతేడాది పరుగులను నియంత్రిస్తూ వికెట్లు తీసిన అవేశ్‌ ఖాన్‌ ఈ సారి ఆవేశంగా షార్ట్‌ పిచ్‌ బంతులేశాడు. బ్యాటర్‌ బౌండరీ కొట్టగానే బుర్ర ఉపయోగించకుండా వేగంగా వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఫీల్డింగ్‌ సెటప్‌ ఒకలా పెడితే అతడు బంతుల్ని మరోలా వేశాడు. 4 ఓవర్లలో 44 ఇచ్చాడు. దాంతో 2,3 సార్లు రాహుల్‌ అతడిని మందలించాడు.


ఛేజింగ్‌లో వీక్‌ మైండ్‌సెట్‌


టార్గెట్లను ఛేదించడంలో లక్నో వీక్‌గా కనిపించింది! గుజరాత్‌కు వీరికీ అదే తేడా! ఎల్‌ఎస్‌జీ ఈ సీజన్లో ఆఖరి 11 మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన 6కు 6 గెలిచేసింది. రెండో బ్యాటింగ్‌లో ఐదుకు ఐదూ ఓడిపోయింది. మైండ్‌సెట్‌లో ఎక్కడో లోపం ఉన్నట్టు కనిపించింది. తమ బ్యాటింగ్‌ బలానికి తగ్గట్టు కాకుండా డిఫెన్సివ్‌గా ఆడటం కొంప ముంచింది. కేఎల్‌ రాహుల్‌, దీపక్‌ హుడా మిడిల్‌ ఓవర్లలో సింగిల్స్‌, డబుల్స్‌ కాకుండా షాట్లు ఆడితే పరిస్థితి మరోలా ఉండేది. ఒత్తిడి ఉండటం, బంతులు తక్కువగా ఉండటంతో లూయిస్‌ నిలదొక్కుకోలేదు.


డ్యూతో పాటు లక్‌ లేదు!


బెంగళూరుతో పోలిస్తే లక్నోను దురదృష్టం వెంటాడింది. చిరుజల్లుల కారణంగా డ్యూ రాలేదు. దాంతో ఛేదన కష్టంగా మారింది. బంతిపై చక్కగా పట్టు చిక్కడం ఆర్సీబీకి ప్లస్‌ అయింది.  డెత్‌లో హేజిల్‌వుడ్‌, హర్షల్‌ పటేల్‌ వైడ్లు వేసినా మంచి లెంగ్తుల్లో బంతులు వేశారు. బౌండరీలు రావడం లేదని ఆఫ్‌సైడ్‌ జరిగి ఫైన్‌లెగ్‌లోకి ఆడిన రాహుల్‌ ఔటయ్యాడు. తర్వాతి బంతికే కృనాల్‌ డకౌట్‌ అయ్యాడు. దాంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది.


మూమెంటమ్‌ షిప్టింగ్‌


ఈ మ్యాచులో లక్నోతో పోలిస్తే ఆర్సీబీ మూమెంటమ్‌ను తనవైపు చక్కగా తిప్పుకుంది. ఎల్‌ఎస్‌జీ బౌలింగ్‌ చేస్తున్నప్పుడు మిడిల్‌ ఓవర్లలో పరుగులను నియంత్రించింది. దాంతో ఆర్సీబీ బ్యాటర్లు షాట్లు ఆడాల్సి వచ్చింది. వాళ్లిచ్చిన క్యాచులు వదిలేయడంతో మూమెంటమ్‌ ప్రత్యర్థి వైపుకు మళ్లింది. రాహుల్‌, దీపక్‌ సిక్సర్లు, బౌండరీలు కొట్టడంతో మ్యాచ్‌ వారి చేతుల్లోకి వచ్చింది. అయితే బెంగళూరు తమ ఫీల్డింగ్‌ ఎఫర్ట్‌తో మూమెంటమ్‌ను తమవైపుకు తిప్పేసుకుంది. క్యాచులను చక్కగా ఒడిసిపట్టింది. ఫీల్డింగ్‌లో కనీసం 15 పరుగులను సేవ్‌ చేసింది. హసరంగ ఇందుకు ఉదాహరణ.


- రామకృష్ణ పాలాది