గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా మంచం మీద నుంచి కిందపడిపోయినట్టు అనిపించిందా? లేదా ఎక్కడి నుంచి అకస్మాత్తుగా కిందకు పడిపోతున్నట్లు, ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచినట్టు అనిపించిందా? వాస్తవానికి, అలా పడినట్టు అనిపిస్తుంది. కానీ.. కిందపడిపోరు. మైండ్ లో మాత్రం పడినట్టే అనిపిస్తుంది. మీకు ఇలా జరుగుతుంటే స్లీప్ స్టార్ట్స్ బారిన పడుతున్నట్లు అర్థం. దీన్నే హిప్నిక్ జెర్క్ లేదా మయోక్లోనిక్ జెర్క్స్ అని కూడా పిలుస్తారు. అంటే దీన్ని అర్థం ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు అలా ఆకస్మికంగా జరిగినట్టు అనిపించడానికి కారణం కండరాల సంకోచాలు.


ఒక వ్యక్తి నిద్రలోకి జారుకోవడం ప్రారంభించినప్పుడు శరీరంలోని భాగాలు ఆకస్మికంగా కుదుపుకు లోనవుతాయి. ఇది చేతులు, కాళ్ళపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. మంచం మీద నుంచి పడిపోయిన అనుభూతి, కల రావడం కూడా నిద్ర ప్రారంభాన్ని సూచిస్తాయని నిపుణులు చెప్తున్నారు. మెలకువగా ఉన్న స్థితి నుంచి నిద్రలోకి మారుతున్నప్పుడు కండరాలు అకస్మాత్తుగా సడలించడం జరుగుతుంది. అప్పుడు నిద్ర మొదలవుతుంది. నిద్రపోతున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి. కొన్ని సార్లు కండరాలు సంకోచానికి గురైనప్పుడు ఇలా సంభవిస్తుంది. అయితే నిద్రలో కింద పడిపోయినట్టు అనిపించిన అనుభూతి తెల్లారిన తర్వాత గుర్తు ఉండదు. ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక కారణాల ఫలితంగా చాలా మంది వ్యక్తులు ఇలాంటి కుదుపులను అనుభవించవచ్చని నిపుణులు వెల్లడించారు.


అలా ఎందుకు జరుగుతుందంటే?


హిప్నాగోజిక్ జెర్క్స్ ఎందుకు వస్తాయనే దానికి నిర్ధిష్టమైన కారణం లేనప్పటికీ అధిక మొత్తంలో కెఫీన్ తీసుకోవడం, శారీరక, భావోద్వేగ ఒత్తిడి వంటి కొన్ని అంశాలు క్రమంగా వాటి ఫ్రీక్వెన్సీ ని పెంచుతాయి. విపరీతమైన అలసట, నిద్రలేమి కూడా ఈ జెర్క్ వెనుక ప్రధాన కారణంగా ఉంటుందని న్యూరాలజిస్ట్ లు చెప్పుకొచ్చారు. దాదాపు 60 నుంచి 70 శాతం మంది ప్రజలు ఇలానే ఫీలవుతున్నారు. అయితే చాలా మంది వ్యక్తులు వాటిని కొన్ని సార్లు మాత్రమే అనుభవిస్తారు. కానీ కొందరు మహిళలు, పురుషులు మాత్రం నిద్ర రుగ్మతల బారిన పడుతున్నారు.


ఇది ప్రమాదకరమా?


ఇలాంటి అనుభూతికి లోను కావడం ఆరోగ్యానికి ప్రమాదమా అంటే కాదని అంటున్నారు వైద్యులు. అయితే అరుదైన సందర్భాల్లో మాత్రం రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ లేదా పీరియాడిక్ లింబ్ మూవ్‌మెంట్ డిజార్డర్ వంటి రోగాల లక్షణం కావచ్చు. కొంతమంది దీని వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని నుంచి బయట పడేందుకు ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి.


⦿ నిద్రపోయే విధానం మార్చుకోవాలి. నిద్ర సమయం కచ్చితంగా ఎనిమిది గంటలకు పరిమితం చేయాలి.


⦿ ఆహారం, శరీరం హైడ్రేషన్ గా ఉండేలా జాగ్రత్త వహించాలి. అతిగా తినొద్దు అలాగే ఆకలితో పడుకోవద్దు.


⦿ మీ గది చల్లగా, నిశ్శబ్దంగా, చీకటిగా ఉండేలా చూసుకోవాలి.


⦿ పగటి నిద్రను పరిమితం చేసుకోవాలి.


⦿ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.


⦿ పడుకునే ముందు కెఫీన్ తాగడం మానుకోవాలి.


⦿ శ్వాస, మైండ్ ని అదుపులో ఉంచుకునేందుకు మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: ఈ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా? రివర్స్ షాంపూ ట్రై చేయండి