Hyderabad Crime News: హైదరాబాద్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పిల్లలకు సెలవు కావడంతో.. పిల్లలను తనతో పాటు పని చేసే చోటుకి తీసుకెళ్లాడు. తండ్రి పని చేసుకుంటుండగా పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్క కాస్త దూరంగా ఉండడంతో నాలుగేళ్ల కుమారుడు అటువైపు వెళ్లాలనుకున్నాడు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన వీధి కుక్కలు బాలుడిపైకి పరిగెత్తుకొచ్చాయి. విషయం గుర్తించిన బాలుడి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ వదలకుండా అతనిపై దాడి చేశాయి. మూడు కుక్కలు బాలుడి శరీరా భాగాలను నోట కరుచుకొని ఒక్కోవైపుగా లాగడం మొదలు పెట్టాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 


అసలేం జరిగిందంటే..?


నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. చే నంబరు చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా పని చేస్తూ భార్యాపిల్లలను పోషిస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్ తో కలిసి బాగ్ అంబర్ పేట ఎరుకల బస్తీలో నివాసం ఉంటున్నాడు.


ఆదివారం రోజు సెలవు కావడంతో పిల్లలిద్దరినీ వెంట బెట్టుకొని తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు ఆడుకుంటూ ఉండగా.. మరో వాచ్ మెన్ తో కలిసి గంగాధర్ వేరే ప్రాంతానికి వెళ్లాడు. కాసేపు అక్కడే ఆడుకున్న ప్రదీప్.. ఆ తర్వాత తన అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలోనే వీధి కుక్కలు వెంటపడ్డాయి. భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు అటూ ఇటూ పరుగులు తీశాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ కాలయముల్లా ఆ వీధి కుక్కలు మాత్రం బాలుడిపైకి వస్తూనే ఉన్నాయి. 


ఓ కుక్క కాలు మరో కుక్క చేయిని నోటికరుచుకొని చెరోవైపు లాగగా..


ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి బాలుడిపై దాడి చేశాయి. ఒక దశలో ఓ కుక్క కాలు పట్టుకోగా, మరో కుక్క బాలుడి చేయిని నోట కరుచుకొని చెరోవైపు లాగాయి. ఈ క్రమంలో బాలుడు తవ్రంగా గాయపడ్డాడు. తమ్ముడి ఆర్తనాదాలు విని అక్కడకు వచ్చిన ఆరేళ్ల సోదరి.. వెంటనే విషయాన్ని తండ్రికి చెప్పింది. ఆయన వచ్చి అదిలించడంతో కుక్కలు బాలుడిని వదిలేశాయి. తీవ్ర గాయాలపాలైన బాలుడిని హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే బాలుడి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


ఆటవిడుపు కోసం బయటకు తీసుకొస్తే.. కుక్కల దాడిలో కుమారుడు చనిపోవడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరువుతున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా.. బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసింది కనిపించింద. సీసీటీవీ ఫుటేజీలో బాలుడిపై జరిగిన దాడంతా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తోంది. వీధి కుక్కలు ఉన్న చోట చిన్న పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదని పోలీసులు చెబుతున్నారు. చిన్న పిల్లల తల్లిడంద్రులు ఎప్పుడూ వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. ఏమాత్రం ఆద మరిచినా ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని వివరిస్తున్నారు.