Cold Feet and Hands in Winter : శరీరమంతా వేడిగా ఉన్నా.. కొందరికి చేతులు, పాదాలు మాత్రం చల్లగా ఉంటాయి. సాధారణంగా ఉండాల్సిన వాటికంటే చల్లగా మారిపోతాయి. చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా చేతులు, పాదాలు చల్లగా మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయట. అలాగే సమస్యను అధిగమించేందుకు కూడా కొన్ని సూచనలిస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 


కారణాలివే.. 


రక్తప్రసరణ : చేతులు, పాదాల్లో తగినంత రక్తప్రసరణ లేకపోవడం వల్ల అవి చల్లగా మారుతాయి. కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఉన్నవారిలో రక్తప్రసరణ తక్కువగా ఉంటుంది. 


వాతావరణ మార్పులు : చలికాలంలో లేదా చల్లని ప్రదేశాల్లో ఉన్నప్పుడు చేతులు, కాళ్లు బాగా చల్లగా మారిపోతాయి. చేతులు, పాదాలకు రక్తప్రసరణ తక్కువగా ఉంటుంది. 


రక్తనాళాల్లో మార్పులు :  రక్తనాళాలు అధికంగా కుంచించుకుపోయి.. రక్త సరఫరాను పరిమితం చేసినప్పుడు కూడా ఈ పరిస్థితి ఎదురవుతుంది. కొందరిలో కాళ్లు లేతరంగులో, నీలంగా, ఎరుపుగా మారుతాయి. తిమ్మిరిని, నొప్పిని కూడా పెంచుతాయి. 


ఎనిమియా : ఐరన్ లోపం లేదా రక్తహీనత అనేది హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ పంపిణీని ప్రభావితం చేసి.. చేతులు, పాదాలకు రక్తప్రసరణ తగ్గిస్తుంది. 


థైరాయిడ్ : హైపోథైరాయిడిజం మెటబాలీజంను తగ్గిస్తుంది. దీనివల్ల వేడి తగ్గి చలిపెరుగుతుంది. కాళ్లు, చేతులు చల్లగా మారిపోతాయి. 


మధుమేహం : మధుమేహం వల్ల నరాలు నష్టపోయి.. శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. చల్లని అనుభూతిని ఇది పెంచుతుంది. పాదాలు, చేతుల్లో జలదరింపు, తిమ్మిరి పెరుగుతుంది. 


ఒత్తిడి : ఒత్తిడి ఉన్నవారిలో రక్తనాళాలు పాదాలు, చేతులలో సంకోచిస్తాయి. దీనివల్ల అక్కడ రక్తప్రసరణ తగ్గి చల్లగా మార్చేస్తాయి. 


స్మోకింగ్ : పొగతాగడం వల్ల కూడా చేతులు, పాదాలు చల్లగా మారతాయి. ఇవి రక్తనాళాలను డ్యామేజ్ చేసి.. వాటి పనితీరును డిస్టర్బ్ చేస్తాయి. దీనివల్ల చేతులు, పాదాల్లో వేడి తగ్గుతుంది.


తీసుకోవాల్సిన జాగ్రత్తలివే


ఫిజికల్​గా యాక్టివ్​గా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల చేతులు, పాదాల్లో రక్తప్రసరణ పెరుగుతుంది. ఎరోబిక్స్, వాక్ చేయడం, సైక్లింగ్ మిమ్మల్ని వేడిగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. చలికాలంలో స్వెటర్లు, చేతులకు గ్లౌవ్స్​, కాళ్లకు సాక్స్​లు వేసుకుంటే మంచిది. థర్మల్, ఊల్ ఫ్యాబ్రిక్స్ వెచ్చదనాన్ని అందిస్తాయి. 


ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ఇది కూడా రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. స్మోకింగ్ అలవాటును మానేస్తే కూడా మంచి ఫలితాలుంటాయి. ఇది రక్తప్రసరణను పెంచుతుంది. చేతులు, కాళ్లను గోరువెచ్చని నీటిలో ఉంచి.. బ్లడ్ ఫ్లో పెరిగి.. చలి తగ్గుతుంది.  వెంటనే రిలీఫ్ కావాలంటే ఇది ఫాలో అవ్వొచ్చు. అలాగే ఐరన్​ను పెంచే ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలి.  హీటింగ్ ప్యాడ్, వార్మర్స్ కూడా మంచి రిలీఫ్ ఇస్తాయి. మసాజ్ కూడా పరిస్థితిని మెరుగు చేస్తుంది. 



Also Read : పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.