క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత త్వరగా దాని నుంచి ముక్తి పొందవచ్చు. సత్వర చికిత్సతో ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను డెవలప్ చేసి.. వ్యాధిని ముందే పసిగట్టే ప్రక్రియపై ప్రయత్నాలు జరుగుతున్నాయి. బోస్టన్‌లోని నార్త్ఈస్టర్న్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఇప్పటికే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను కచ్చితంగా నిర్ధరించే ఏఐ టూల్‌ను కనుగొన్నారు. ఇప్పుడు వాళ్లే.. బయోఇంజనీరింగ్ ప్రొఫెసర్ సయీద్ అమల్ నేతృత్వంలో రొమ్ము క్యాన్సర్‌ను త్వరగా గుర్తించగలిగే మరొక ఏటీ టూల్‌ను రూపొందించారు. ఇది 99.78 శాతం కచ్చితమైన సమాచారాన్ని ఇస్తుందని, దాని వల్ల రోగి.. వ్యాధిని ముదరక ముందే చికిత్స పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ గణాంకాల ప్రకారం.. ఏటా 30 శాతం వరకు రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. 2024లో రొమ్ము క్యాన్సర్ వల్ల 42,500 మంది మహిళలు చనిపోయే ప్రమాదం ఉంది. వ్యాధి ముదిరిపోవడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోందని, క్యాన్సర్‌ను ముందే గుర్తించాల్సిన టెక్నాలజీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సరికొత్త ఏఐ టూల్ ఈ సమస్యను పరిష్కరించగలదని అంటున్నారు.
ఈ కొత్త ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని డాక్టర్లు రకరకాల క్యాన్సర్ల నిర్ధారణలో ఉపయోగించవచ్చు. ఈ కొత్త పరిజ్ఞానం డిజిటల్ పాథాలజీ రంగంలో విప్లవాత్మకమైందిగా చెప్పవచ్చు.
ప్రొఫెసర్ సయీద్ అమల్ మాట్లాడుతూ.. ఈ ఏఐ టూల్ అత్యధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను పరిశీలించి.. క్యాన్సర్ లక్షణాలను గుర్తిస్తుందన్నారు. హిస్టరికల్ డేటాను ఉపయోగించి రోగ నిర్ధారణ ఎలా చెయ్యాలో చెబుతుందన్నారు. ఏఐ బయాప్సీలో ట్యూమర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చెయ్యదు. 10, 20 డయాగ్నోసిస్‌లు చేసిన తర్వాత కూడా అలసి పోదు. కనుక నిర్ధారణలో ఖచ్చితత్వం సాధ్యపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ ప్రక్రియ ద్వారా మరింత ఖచ్చితంగా సమస్యను గుర్తించేందుకు, మరింత త్వరగా చికిత్స ప్రారంభించేందుకు ఈ ఏఐ టూల్ ఉపయోగపడుతుంది. రొమ్ము క్యాన్సర్ ప్రాజెక్ట్ లో క్యాన్సర్ హిస్టోపాథలాజికల్ డేటాబేస్ లో ప్రాణాంతక కణితులను చూపే చిత్రాలు, ప్రమాదకరం కానీ చిత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పరిశోధకులు ఈ సమాచారాన్ని వినియోగించుకుని ఈ లెర్నింగ్ మోడల్ రూపొందించారు. వ్యాధి నిర్ధారణలో ఏర్పడుతున్న లోపాలను తగ్గించి.. ఖచ్చితత్వాన్ని పెంపొందించేందుకు వీలుగా బ్రెస్ట్ టిష్యూ ఇమేజ్ డేటాపై పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి ఈ మోడల్‌ను రూపొందించినట్లు అమల్ వివరించారు. ఈ టూల్ ఉపయోగించి వ్యాధిని నిర్ధారణ చెయ్యడమంటే.. ఒకరి కంటె ఎక్కువ మంది డాక్టర్ల అభిప్రాయాలు తీసుకోవడంతో సమానం అని ఆయన పేర్కొన్నారు.
Also Read : మహిళలూ.. ఈ వయసులో బీట్ రూట్ జ్యూస్ తప్పక తాగండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.