New Telangana PCC chief will announce :  తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నికపై అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది.  ముఖ్య నాయకులను అందుబాటులో ఉండాలని ఏఐసీసీ ఆదేశించింది. రాత్రి 8 గంటలకు ముఖ్య నాయకులతో సీఎం రేవంత్.. ఇంఛార్జి దీపా దాస్ మూన్షి సమావేశం అవుతారు. ఆ తర్వాత ప్రకటన ఉంటుంది. ఇప్పటికే ఆశావహులు తమ  ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.  పార్లమెంట్ హాల్ లో సోనియాగాంధీ ని   వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ యాష్కీ కలిసి చర్చించారు. తమ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 


పీసీసీ చీఫ్ ముగిసిన రేవంత్ రెడ్డి పదవీ కాలం               


పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ పార్టీని గెలిపించారు. ఆయనకు సీఎం పదవి వచ్చింది. ఇక పార్టీ బాధ్యతల నుంచి ఆయనను తప్పించి వేరే వారికి ఇస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ అది ప్రచారంగానే ఉంది. లోక్ సభ ఎన్నికలు అయిపోయాయి.    ఈ నెల 27వ తేదీతో  అంటే గురువారంతోనే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడై 3 సంవ‌త్స‌రాలు అవుతోంది. కాంగ్రెస్ పార్టీ నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం పీసీసీ చీఫ్ ప‌ద‌వికాలం 3 సంవ‌త్స‌రాలు. ఆ త‌ర్వాత కొత్త వారిని నియ‌మించాల్సి ఉంటుంది. లేదా పొడిగించ‌వ‌చ్చు. అయితే, సీఎంగా, పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి… పీసీసీ చీఫ్ పోస్టును మ‌రొక నేత‌కు కేటాయించాల‌ని అధిష్టానాన్ని కోరారు.


లోక్ సభ ఎన్నికల కారణంగా  ఇప్పటి వరకూ మార్చని హైకమాండ్               


నిజానికి అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్తవ్వ‌గానే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ వ‌స్తార‌ని అంతా ఊహించారు. కానీ లోక్ స‌భ ఎన్నిక‌లు వెంట‌నే ఉండ‌టంతో రేవంత్ రెడ్డినే అధిష్టానం కంటిన్యూ చేసింది. దీంతో ఇప్పుడు మార్పు అనివార్యం కాగా… రేవంత్ రెడ్డి కూడా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని, కొత్త పీసీసీ చీఫ్ నిర్ణ‌యంపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని రేవంత్ కోరారు.  బీసీ లేదా ఎస్సీ సామాజిక‌వ‌ర్గ నేత‌కు పీసీసీ ద‌క్కే అవ‌కాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ తదితరులు పీసీసీ చీఫ్‌ ఆశావహుల్లో ఉన్నారు. 


సామాజిక సమీకరణాల్లో భాగంగా  ఎంపిక చేసే అవకాశం                       


ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క, బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి.  రేవంత్ ఛాయిస్ గా మంత్రి సీతక్క పేరు తెర మీదకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజన మహిళకు పీసీసీ పగ్గాలు అప్పగించటం ద్వారా సానుకూలత పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు పార్టీ జాతీయ స్థాయి పోస్టులుసైతం తెలంగాణ నేతలకు దక్కే అవకాశం ఉంది. సిడబ్ల్యూసీ, జనరల్ సెక్రటరీ, సెక్రటరీ పోస్టులకోసం నేతలు  ప్రయత్నాలు చేసుకుంటున్నారు.