Telangana Electricity Distribution Corporation : విద్యుత్ వినియోగదారులను ఎప్పుడూ ఒక సందేహం వేధిస్తూనే ఉంటుంది. వినియోగించిన విద్యుత్ కంటే బిల్లు ఎక్కువగా వచ్చిందన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ప్రతి నెల కనిపిస్తూ ఉంటుంది. అయితే, ఇటువంటి అనుమానాలను నేరుగా వినియోగదారులే నివృత్తి చేసుకునే అవకాశాన్ని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) తీసుకువచ్చింది. వినియోగించిన కరెంటుతో పోలిస్తే జారీ చేసిన బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానం ఉన్నవారు డిస్కం డిజిటల్ క్యాలిక్యులేటర్ తో సరి చూసుకునే అవకాశం కల్పిస్తోంది.


ఈ సదుపాయాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకుని, అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెల 30 లేదా 31 రోజులకు మీటర్ రీడింగ్ నమోదు చేసి బిల్లు జారీ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెండు లేదా మూడు రోజులు ఆలస్యంగా నమోదు చేస్తున్న కారణంగా ఆ నెలలో వినియోగించిన యూనిట్లు పెరగడంతో.. టారిఫ్ మారి అధికంగా బిల్లులు వస్తున్నాయన్న అపోహ కొందరు వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ అపోహలను నివృత్తి చేసేందుకే ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు డిస్కం అధికారులు చెబుతున్నారు.


వాస్తవానికి దాదాపు 99.5% బిల్లులో నెల రోజులకే ఇస్తున్నామని, రీడింగ్ తీసిన రోజుల సంఖ్యతో సంబంధం లేకుండా కచ్చితంగా నెలరోజులకే వచ్చేలా స్పాట్ బిల్లింగ్ మిషన్ లో సాఫ్ట్వేర్ ను పొందుపరిచినట్లు  అధికారులు వెల్లడిస్తున్నారు. అయినా కొందరి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే నూతన విధానానికి శ్రీకారం చుట్టినట్లు అధికారులు చెబుతున్నారు. 


గృహ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల సమాచారం తెలుసుకునేందుకు వీలుగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వెబ్సైట్లో ఎనర్జీ చార్జెస్ కాలిక్యులేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీసెస్ పేరుతో ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బిల్లులో నమోదైన రీడింగ్ తీసిన తాలూకు తేదీలు, యూనిట్ల వివరాలను క్యాలిక్యులేటర్ లో నమోదు చేస్తే బిల్లింగ్ రోజులు ఎంత ఛార్జ్ చేశారనే వివరాలు తెలుస్తాయని సీఎండీ ముషారఫ్ ఫరూకీ వెల్లడించారు. త్వరలో దీన్ని సంస్ధ మొబైల్ యాప్ లో పొందుపరచనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని రెండు పంపిణీ సంస్థల చార్జీలు ఒకటే అయినందున ఉత్తర డిస్కం వినియోగదారులకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు. 


అనుమానాల నివృత్తికి అవకాశం 


కరెంట్ బిల్లు చెల్లించే ప్రతిసారి ఇటువంటి అనుమానాలు ఎంతో మంది వినియోగదారులకు వస్తుంటాయి. ఈ అనుమానాలను నివృత్తి చేసే దిశగా డిస్కం అధికారులు చర్యలు చేపట్టడం గమనార్హం. అయితే, ఈ విధానం పట్ల ప్రజలకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని పలువురు చెబుతున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించే వారిలో చాలా మందికి ఈ విధానాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై అవగాహన ఉండదని, ప్రజల్లో అవగాహన కలిగించడం ద్వారా ఈ విధానం పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేందుకు అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు. మరి డిస్కం అధికారులు ఆ దిశగా అవగాహన కార్యక్రమాలను చేపడతారో లేదా అన్నది చూడాల్సి ఉంది.