ఎప్పుడైనా అసోం వెళ్లితే ఈ మిరపకాయను మీరు చూడొచ్చు. ప్రతి అస్సామీ ఇంట్లో ఇది కచ్చితంగా ఉంటుంది. చాలా మంది అస్సామీలు దీన్ని అన్నంతో పాటూ తింటుంటారు. ఆ ఘాటుకు అల్లాడిపోతారు. అయినా సరే దాన్ని ఆహారంతో పాటూ తినడం ఓ కిక్కు. ఈ మిరపకాయ పేరు భూత్ జోలోకియా. దీన్ని భూటాన్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. దీని జన్మస్థలం ఈశాన్య భారతదేశమే. ముఖ్యంగా నాగాలాండ్, అసోంలలో కనిపిస్తుంది. ఆ రాష్ట్ర వంటకాలలో దీనిదే ప్రధాన భాగం. భూత్ అంటే అస్సామీ భాషలో దెయ్యం అని అర్థం. అందుకే దీన్ని ఆంగ్లంలో ‘ఘోస్ట్ పెప్పర్’ అని పిలవసాగారు. వీటిలో చాలా రకాల ఉన్నాయి. వాటిని పీచ్ ఘోస్ట్ పెప్పర్, ఎల్లో ఘోస్ట్ పెప్పర్, చాక్లెట్ ఘోస్ట్ పెప్పర్, పర్పుల్ ఘోస్ట్ పెప్పర్ ఇలా పిలుస్తారు. 


గిన్నిస్ బుక్‌లోకి...
ఈ రాకాసి మిరపకాయ 2007లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత కారమైన మిరపకాయలుగా ఇవి రికార్డుల్లో చోటు సంపాదించాయి. ఈ మిరపకాయలు తిన్నవెంటనే తీపిగా ఉన్నట్టు అనిపిస్తాయి. 40 నుంచి 50 సెకన్ల తరువాత కారం నాలుకకు తెలుస్తుంది. ఆ కారానికి చెమటలు పట్టేస్తాయి. తీపిగా ఉంటే పదార్థం, చల్లని నీళ్లు కోసం వెతికేసుకుంటారు. అందుకే నేరుగా ఆ మిరపకాయలు తినకూడదని చెబుతారు ఆరోగ్య నిపుణులు. వండుకున్నాకే తినడం మంచిది. లేకుంటా నాలుక మండిపోయి, విలవిలలాడిపోవడం ఖాయం. అలవాటు లేని వారైతే ఆ కారానికి నిలవలేరు. వీటిని కూరల్లో, బిర్యానీల్లో, మసాలా తయారీకి ఉపయోగించుకోవచ్చు. ఆత్మరక్షణ కోసం వాడే పెప్పర్ స్ప్రేలను తయారుచేయడానికి ఈ మిరపకాయలు వినియోగిస్తారు. అడవులకు దగ్గరగా నివసించే వాళ్లు  ఈ కారం పొడిని అడవి జంతువుల నుంచి రక్షణకు వినియోగిస్తారు. 


రాకాసి మిరపకాయతో ఉపయోగాలు...
దీని వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. భూత్ జొలోకియా నుంచి వచ్చే వేడి నాసిక మార్గాన్ని క్లియర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే సైనస్ రోగులకు మేలు చేస్తుంది. మైగ్రేన్లు, తలనొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. జీవక్రియను వేగవంతం చేయడానికి, బరువు తగ్గేందుకు ఇది సహకరిస్తుంది. 


మీరు స్పైసీ ఫుడ్ ఇష్టపడేవారైనా, వంటకాలను చాలా కారంగా తినేవారైనా కూడా ఈ మిరపకాయను మాత్రం నేరుగా తినేందుకు ప్రయత్నించకండి. దీన్ని కారం పొట్ట భరించలేక చాలా సమస్యలు ఏర్పడతాయి. విరేచనాలు కూడా అవుతాయి. కాబట్టి అనవసర స్టంట్‌లు చేయకుండా ఉండడం ఉత్తమం. దీన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే కూరలో కలుపుకుని వండుకోవాలి. సాధారణంగా మనం ఇంట్లో వాడే మిరపకాయలకు ఇది దాదాపు 500 రెట్లు ఇవి కారంగా ఉంటాయి. 


Also read: బంగాళాదుంపలు కేవలం కూరకే కాదు, పాత్రల తుప్పును పోగొట్టి, ఆ మరకల్ని మాయం చేస్తాయి


Also read: వీటిని రోజూ తింటే చాలు, డయాబెటిస్ అదుపులో ఉండడం ఖాయం