మీకు ఇష్టమైన కూర ఏదని అడిగితే... ఎక్కువ మంది చెప్పే సమాధానం ‘బంగాళాదుంప’. ఇక పిల్లలకైతే బంగాళాదుంప వేపుడు అంటే భలే ఇష్టం. ఇక వాటితో చేసే చిప్స్ గురించి చెప్పక్కర్లేదు. బంగాళాదుంప దేనితోనైనా కలిసిపోతుంది. ఏ కూరగాయతోనైనా జతకట్టి రుచిని పెంచుతుంది. బంగాళాదుంప కేవలం కూరకి, వేపుడుకి, వెజ్ బిర్యానీకే కాదు ఇంకా రకరకాలుగా ఉపయోగపడుతుంది. దైనందిన జీవితాల్లో బంగాళాదుంపలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి. 


1. మీ సూప్ లు లేదా, పులుసులు వంటి వాటిల్లో ఒక్కోసారి ఉప్పు అధికంగా పడిపోతుంది. ఆ అదనపు ఉప్పును తీయడానికి బంగాళాదుంపలు ఉపయోగపడాతాయి. బంగాళాదుంపను పెద్ద ముక్కలుగా కోసి ఆ రసం లేదా పులుసుల్లో వేయాలి. ఓ పదినిమిషాల తరువాత తీసి పడేయచ్చు. అదనపు ఉప్పును బంగాళాదుంపలు పీల్చేస్తాయి. 


2. బంగాళాదుంప రసాన్ని కాలిన గాయాలకు మందుగా వాడచ్చు. కాలిన గాయం అధికంగా ఉంటే ఈ దుంపను ఉడకబెట్టి మెత్తగా చేయాలి. పచ్చి బంగాళాదుంప రసాన్ని తీసి అందులో ఈ మెత్తని పేస్టును కలపాలి. దీన్ని కాలిన గాయాలపై పూయాలి. రోజులో నాలుగైదు సార్లు ఇలా చేస్తూ ఉంటే నొప్పి త్వరగా తగ్గుతుంది. గాయం మానుతుంది.


3. ఏదైనా ఇగురు కూర వండుదామనుకుంటే నీళ్లు అధికంగా వేసేశారా? ఇగురు కాస్త పులుసులా తయారైందా? అయితే వెంటనే ఉడకబెట్టిన బంగాళాదుంపను మెత్తగా చేసి అందులో కలపండి. గ్రీవీ చిక్కబడుతుంది. 


4. బంగాళాదుంపలు మంచి స్టెయిర్ రిమూవల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. వైన్ మరకలు వంటివి పోకపోతే బంగాళాదుంప ముక్కలతో రుద్దండి. కాస్త నీళ్లు చేర్చి పదే పదే రుద్దడం వల్ల ఆ మరకలు పోయే అవకాశాలు ఎక్కువ. 


5. పాత్రలు తుప్పు పట్టేశాయా? ఆ తుప్పును పోగొట్టడం కష్టంగా ఉందా? అయితే కొంచెం ఉప్పు, డిటర్జెంట్, బేకింగ్ సోడా  కలిపి ఆ మిశ్రమంలో బంగాళా దుంప ముక్కను ముంచి, తుప్పు పట్టిన పాత్రలను తోమాలి. తుప్పు పోయే వరకు అలా తోమాల్సిందే. బంగాళాదుంప అద్భుతం చేసి చూపిస్తుంది. 


6. పకోడీలు, బజ్జీలు వంటివి క్రిస్పీగా రావాలంటే బ్రెడ్ ముక్కలు, కార్న్ ఫ్లోర్ కు బదులు ఉడకబెట్టిన బంగాళాదుంపను వాడుకోవచ్చు. దీన్ని పకోడి పిండిలో కలిపి వేస్తే కరకరలాడేలా వస్తాయి. 


7. బంగాళాదుంపలను చర్మ సమస్యలు పొగొట్టడానికి ఉపయోగించవచ్చు. ముఖం మీద ఉండే మచ్చలు, టాన్ పోవడానికి బంగాళాదుంప ముక్కతో రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి మెరుపు  సంతరించుకుంటుంది. ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. 


8. వెండి వస్తువులు మెరిపించడంలో ఇవి ముందుంటాయి. ఉడికించిన బంగాళాదుంప ముక్కతో వెండి వస్తువులను రుద్దితే తళతళలాడతాయి. 


Also read: వీటిని రోజూ తింటే చాలు, డయాబెటిస్ అదుపులో ఉండడం ఖాయం


Also read: ఈ రెండు ప్రాంతాల్లో వచ్చే నొప్పి కరోనా సోకిందని చెప్పే ముందస్తు సంకేతం కావచ్చు, తేలికగా తీసుకోవద్దు