కాఫీ తాగనిదే కొంతమందికి తెల్లవారదు. నిద్ర లేవగానే కాఫీ కొంచెం గొంతులో పడగానే చాలా యాక్టివ్ గా ఉంటామని చెప్తారు. ప్రపంచ వ్యాప్తంగా కాఫీకి ఎంతో మంది ప్రియులు ఉన్నారు. కోల్డ్ కాఫీ, క్యాపిచినో అని రకరకాలుగా చేసుకుని తాగేస్తారు. క్యాపిచినో కి ఫుల్ డిమాండ్ కూడా ఉంది. అందులో ఉండే కెఫీన్ శరీరానికి కొంత వరకు మేలు చేస్తుంది. కానీ అతిగా మాత్రం తీసుకోకూడదు. కాఫీ చేసుకున్న తర్వాత ఆ డికాషన్ చెత్త బుట్టలో వేసేస్తారు. కానీ దాని వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయని తెలుసా. ఇంటి పనుల దగ్గర నుంచి మొక్కల వరకు ఈ డికాషన్ చాలా ఉపయోగపడుతుంది.


ఫ్రిజ్ లో బ్యాడ్ స్మెల్ పోగొడుతుంది


ఫ్రిజ్ లో కుళ్లిపోయిన లేదా దుర్వాసన వస్తుంటే చాలా మంది బేకింగ్ సోడా పెడతారు. కానీ దాని కంటే కాఫీ డికాషన్ పెట్టుకోవచ్చు. కాఫీ డికాషన్ ఎండ బెట్టి దాని ఫ్రిజ్ లో ఒక చోట పెట్టాలి. గాలిలోని సల్ఫర్ తో కలిసి చెడు వాసనలని గ్రహించి బయటకి పంపిస్తుంది. రిఫ్రిజిరేటర్ అనే కాదు చెడు వాసన ఉన్న ప్రతి స్థలంలో కూడా దీని ఉపయోగించి వాటిని పోగొట్టుకోవచ్చు.


పాత్రలు శుభ్రం చెయ్యొచ్చు


జిడ్డు, ఎండిన మాడిపోయిన గిన్నెలు శుభ్రం చేసుకోవచ్చు. కొద్దిగా డిటర్జెంట్ తో కాఫీ డికాషన్ కలిపి వాటిని శుభ్రం చేసుకుంటే అవి మెరిసిపోవడం ఖాయం. పాన్, గిన్నెలు అడుగంటిపోయిన మరకలు చాలా సులువుగా తొలగించేస్తుంది.


కాఫీ ఆధారిత కొవ్వొత్తులు


కాఫీ మంచి వాసన వస్తుంది. ఆ సువాసన మీ ఇల్లంతా రావాలంటే కాఫీ ఆధారిత కొవ్వొత్తులు చేసుకుంటే చాలా బాగుతాయి. చాలా సింపుల్ గా దీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాఫీ డికాషన్, మైనం, ఒత్తులు, ఒక చిన్న కూజా లాంటి పాత్ర ఉంటే సరిపోతుంది. ఆ పాత్రలో మైనం పోసి ఒత్తు పెట్టి అందులో కొద్దిగా డికాషన్ వేస్తే సరిపోతుంది. మైనం ఆరిన తర్వాత ఒత్తిని వెలిగిస్తే ఇల్లంతా కాఫీ సువాసనతో అద్భుతంగా ఉంటుంది. కొవ్వొత్తి కాలుతున్నప్పుడు వచ్చే ఆ కాఫీ వాసన అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయం. ఇది ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తుంది.


మొక్కలు మంచి ఎరువు


చాలా నేలల్లో మొక్కలు పెరిగేందుకు అవసరమైన ముఖ్యమైన పోషకాలు అందవు. అటువంటి నేలల్లో మొక్కలు పెరిగేందుకు తగినంత పోషకాలను అందించేందుకు కాఫీ డికాషన్ చాలా బాగా పని చేస్తుంది. గార్డెన్ లోని మొక్కలకి మీరు కొద్దిగా ఈ కాఫీ డికాషన్ పొడిని చల్లుకోవచ్చు, లేదంటే కంపోస్ట్ ఎరువులో కలుపుకోవచ్చు. మొక్క పెరుగుదలని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. గులాబీలు, అజలేయాలు, రోడోడెండ్రాన్లు, కామెల్లియాస్ వంటి మొక్కలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


క్రిమి సంహారకంగా..


తెగుళ్ళ నియంత్రణకు కూడా ఇది ఉపయోగపడుతుంది. గార్డెన్ లో మొక్కల మొదళ్ళలో ఉండే చీమలు, నత్తలు పోగొట్టేందుకు క్రిమి సంహారకంగా వినియోగించుకోవచ్చు. చీమలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో కూడా డికాషన్‌ను వేయొచ్చు. రెండు వారాలకు ఒకసారి ఆ పొడిని మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది.   


Also read: మహమ్మారి ఇంకా పోలేదు,ప్రపంచంలో పద్నాలుగు కోట్ల మందికి లాంగ్ కోవిడ్ లక్షణాలు


Also read: పదహారు పిల్లల తల్లి, ఆమె జీవితంలో 14 ఏళ్లు గర్భవతే