Bengaluru Floods:
వరద కష్టాలు
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ధాటికి చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవటం వల్ల మురుగు నీరంతా ఇళ్లలోకి, షాపుల్లోకి వచ్చి చేరుతోంది. రహదారులపైనా నీళ్లు నిలిచిపోవటం వల్ల గంటల కొద్దీ ట్రాఫిక్ ఆగిపోతోంది. బెల్లందూర్, సర్జాపుర రోడ్, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్, BEML లే అవుట్ ప్రాంతాల్లో వరదల తాకిడి ఎక్కువగా ఉంది. చాలా సంవత్సరాల తరవాత బెంగళూరులో ఈ స్థాయిలో వర్షపాతం నమోదైంది. వరదలు ఎంత ఇబ్బంది పెడుతున్నాయో వివరిస్తూ...కొందరు స్థానికులు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మారదహళ్లి ప్రాంతంలోని స్పైస్ గార్డెన్ వద్ద వరద నీటిలో బైక్‌లు కొట్టుకుపోయాయి. స్పైస్ గార్డెన్ నుంచి వైట్‌ఫీల్డ్ మార్గమంతా వరద నీటితో నిండిపోయింది. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు, సొసైటీల్లోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈకో స్పేస్ వద్ద వర్షపు నీరు భారీగా చేరుకుంది. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కొందరు సెక్యూరిటీ గార్డ్‌లు రంగంలోకి దిగారు. సెప్టెంబర్ 9వ తేదీ వరకూ బెంగళూరులో ఇలా భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. కోస్టల్ కర్ణాటకతో పాటు, హిల్ ఏరియాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని వివరిస్తోంది. కొడగు, శివమొగ్గ,ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి, చిక్‌మంగళూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. బీదర్, కలబుర్గి, విజయపుర, గడగ్, ధార్వాడ్, హవేరి ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని IMD చెబుతోంది.