ప్రభుత్వ ఉద్యోగులై ఉండి వారు ఇద్దరూ నైతికత మరిచారు. ఇంట్లో తమ భార్యకు, భర్తకు తెలియకుండా రహస్య సంబంధం కొనసాగించారు. అంతేకాక, అతను ఆమె మోజులో పడి కట్టుకున్న భార్యను తీవ్రమైన ఇబ్బందుల పాలు చేశాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య అతను మరో మహిళ వలలో పడ్డాడని పసిగట్టింది. ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఛాన్స్ కోసం చూసింది. చివరికి తన భర్త అతని సహోద్యోగి అయిన మరో మహిళతో ఏకాంతంగా ఉండగా పట్టేసింది. ఈ ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది.


వరంగల్ మండలం పైడిపల్లి ఆర్టీసీ కాలనీలో ఈ ఘటన జరిగింది. హాసన్ పర్తి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండలోని కుమార్‌ పల్లి ప్రాంతానికి చెందిన జీవన్‌ అనే వ్యక్తి వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో సూపరింటెండెంట్‌గా పని చేసేవాడు. వివిధ కారణాల వల్ల నాలుగేళ్ల క్రితం సస్పెన్షన్‌కు గురయ్యాడు. అదే మున్సిపల్ కార్పొరేషన్ లో తన సహోద్యోగి అయిన ఓ వివాహితతో జీవన్ 9 ఏళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ సంబంధం కొనసాగుతుండగానే అతడికి 2018లో మరో యువతితో పెళ్లి జరిగింది. జీవన్ భార్యతో కలిసి హన్మకొండలో నివాసం ఉంటున్నాడు. వివాహం జరిగినప్పటి నుంచి వీరిద్దరి మధ్య కలహాలు ఉండేవి. అసభ్యకరమైన మాటలతో భార్యను జీవన్ తీవ్రంగా వేధించేవాడు. 


పుట్టింటి నుంచి సగం ఆస్తి తీసుకురావాలని వేధించేవాడు. లేదంటే విడాకులు తీసుకోవాలని హింసించేవాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య అతనికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండి ఉంటుందని అనుమానించింది. ఎలాగైనా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని చూసింది. అలా భర్త కదలికలపై కొన్నాళ్ల నుంచి ఆమె కన్నేసింది. ఆదివారం ఉదయం (సెప్టెంబరు 4) పైడిపల్లిలోని ఆర్‌టీసీ కాలనీలో ఉంటున్న మహిళ ఇంటికి జీవన్‌ వెళ్లాడు. అతనికి తెలియకుండా భార్య వెనకాలే ఫాలో అయింది. వారు గదిలోకి వెళ్లడం చూసి, తలుపు గడియ పెట్టింది. వెంటనే బంధువులు, పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. 


వెంటనే బంధువులు అక్కడికి చేరుకొని ఇంట్లోకి వెళ్లి జీవన్‌ను కొట్టారు. భార్య అతడిని చెప్పుతో కొట్టింది. హసన్‌ పర్తి పోలీసులు జీవన్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే, ఒకే మున్సిపల్ కార్పొరేషన్ లో ఇద్దరు ఉద్యోగుల మధ్య వివాహేతర సంబంధం వెలుగుచూడటం, ఆ వీడియోలు టీవీల్లో, సోషల్ మీడియాలో రావడంతో అంతా చర్చనీయాంశంగా మారింది.