వయస్సుతో సంబంధం లేకుండా హఠాత్తుగా ప్రాణాలు తీసేస్తుంది గుండె నొప్పి. అది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరు. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా వృద్ధులు తమ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వారిలో వయసు రీత్యా వచ్చే వ్యాధులు, గుండెపోటు ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి బయట పడాలంటే వృద్ధులు రోజుకి 6000 నుంచి 9000 అడుగులు నడిస్తే గుండె పోటు, స్ట్రోక్ తో బాధపడే అవకాశం 40 నుంచి 50 శాతం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం తేల్చింది.


యూఎస్ జర్నల్ ప్రచురించిన పరిశోధన ప్రకారం వృద్ధులు క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. 18ఏళ్లు పైబడిన 20,152 మంది వ్యక్తుల మీద జరిపిన ఎనిమిది అధ్యయనాల డేటా ఆధారంగా ఈ ఫలితం వెల్లడించారు. వాళ్ళ నడకని ఒక పరికరం ద్వారా కొలిచి ఆరు సంవత్సరాలకి ఒకసారి వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు. 60 ఏళ్లు పైబడిన వాళ్ళు రోజుకి 9 వేల అడుగులు నడిస్తే వారిలో హృదయ సంబంధ వ్యాధులు ముప్పు తక్కువగా ఉందని గ్రహించారు. వేగంగా కాకుండా నెమ్మదిగా నడవటం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని పరిశోధకులు వెల్లడించారు.


ఇది యువకుల్లో కార్డియో వాస్కులర్ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి సంబంధం లేదని అధ్యయనం తెలిపింది. అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటివి సంవత్సరాల తరబడి ఉండటం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రమాదాలతో ముడి పడి ఉన్నట్టు తెలిపారు. గతంలోని నడక ప్రాధాన్యత తెలుపుతూ మరికొన్ని అధ్యయనాలు వచ్చాయి. ప్రతిరోజు 10 వేల అడుగులు వేసే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిపోతుందని వెల్లడించాయి. అలాగే రెండు వేల అడుగులు వేస్తే అకాల మరణం సంభవించే అవకాశం 9 నుంచి 11 శాతం తగ్గుతుంది. గుండె సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.


వాకింగ్ వల్ల ప్రయోజనాలు


నిత్యం వాకింగ్ చేయడం వల్ల కీళ్ళు బాగా పని చేస్తాయి. శరీరం ఆక్సిజన్ ని ఎక్కువగా గ్రహిస్తుంది. అది రక్తంలో చేరి ఊపిరితిత్తులకు అందుతుంది. దీని వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు వ్యర్థాలని బయటకి పంపిస్తుంది. రెగ్యులర్ గా వాకింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫీన్లు హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజు నడవటం వల్ల బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. నడిచేటప్పుడు చేతులు ముందుకు వెనుకకి కదిలించడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుస్తూనే మధ్య మధ్యలో జాగింగ్, రన్నింగ్ వంటివి చేయడం కూడా మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మానిక్యూర్ వల్ల గోరు క్యాన్సర్- యూఎస్ మహిళకి వింత అనుభవం!