Vande Bharat Train: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో వేచి చూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఆదివారం ఉదయం పది గంటల నుంచి అందుబాటులోకి రానుంది. క్షణాల్లో వేగం అందుకుంటూ గంటకు 90 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో పట్టాలపై పరుగులు తీస్తుంది. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైలుకు పచ్చెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపనున్నట్లు సమాచారం. అయితే ఈ రైలుకు సంబంధించిన బుకింగ్స్ ఈరోజు నుంచే ప్రారంభం అయ్యాయి. వందే భారత్ రైల్లో మొత్తం 16 కోచ్ లు ఉంటాయి. ఇందులో రెండు కోచ్ లు ఎగ్జిక్యూటివ్ కేటగిరీవి. మిగతావి ఎకానమీ కోచ్ లు. ఎగ్జిక్యూటివ్ కోచ్ లో 104 సీట్లు ఉంటాయి. ఎకానమీ క్లాస్ లో వెయ్యి 24 కాగా.. మొత్తం 1,128 ఉంటాయి.
ఆన్ లైన్ తో పాటు కౌంటర్లలో కూడా ఈ టికెట్లు అందుబాటిలో ఉంటాయి. ధరపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే చెన్నై-మైసూర్ మార్గంలో వందే భారత్ రైలు టికెట్ ధర రూ.1200కు(ఏసీ చైర్ కార్ కోసం), ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోసం రూ.2,200కి తక్కువగా లేదు. దూరాన్ని బట్టి విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ టికెట్ ధర ఎంత అనేది నిర్ధారించనున్నారు. అయితే రేపు ప్రారంభం కాబోయే ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ 21 స్టేషన్లలో ఆగుతుంది. మార్గమధ్యంలో చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ జంక్షన్, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతూ.. విశాఖ చేరుకుంటుంది. ఆ తర్వాత అంటే రెండోరోజు నుంచి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.
మామూలుగా అయితే నాలుగు స్టేషన్లలోనే..
వందే భారత్ రైలు సికింద్రాబ్ద లో బయలుదేరి విశాఖ చేరుకునేలోపు కేవలం నాలుగు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. సోమవారం నుంచి రెగ్యులర్ ప్రయాణాన్ని ప్రారంభించనున్న వందేభారత్ రైలు, సికింద్రాబాద్ స్టేషన్ లో మధ్యాహ్నం గంటలకు బయలు దేరుతుంది. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలోనే ఆగనుంది. గమ్యస్థానమైన విశాఖకు రాత్రి 11.30 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. అవే నాలుగు స్టేషన్లలో నిర్దేశిత సమయాల్లో ాగుతూ మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
1128 మంది ప్రయాణికులు కూర్చునే అవకాశం..
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. మొత్తం 1128 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉందని అధికారులు వెల్లడించారు. ఒక్కో కోచ్ పొడవు 23 మీటర్లు కాగా, 52 మంది కూర్చునేలా ఫస్ట్ క్లాస్ కోచ్‌లు రెండున్నాయి. రైలును స్లైడింగ్ డోర్లు, రీడింగ్ లైట్స్, అటెండెంట్ కాల్ బటన్లు, ఆటోమెటిక్ ఎగ్జిట్, ఎంట్రీ డోర్లు, సీసీటీవీ కెమెరాలు, పడుకునే సౌకర్యం కలిగిన కుర్చీలతో అత్యధునికంగా తీర్చిదిద్దారు. ఈ ట్రైన్ పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షలో ఉంటుంది. ఈ సీసీ కెమెరాలు లోకో పైలెట్ క్యాబిన్‌కు అనుసంధానించి ఉంటాయి. లోకో పైలెట్ కంట్రోల్లోనే కోచ్‌ల తలుపులు తెరుచుకునే, మూసివేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. మెట్రో రైల్లో మాదిరిగా ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం టాక్ బ్యాక్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.