గ్యాస్‌ సిలిండర్‌ ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి డబ్బులు అడగడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. మరికొందరు కాసేపు కోపం తెచ్చుకుంటారు. ఎందుకు ఇవ్వాలంటూ ఇంకొందరు వాగ్వాదానికి దిగుతారు. ఇలా ఎవరు ఎన్ని వాదనలు చేసినా సిలిండర్ తెచ్చిన వ్యక్తి మాత్రం తాను అడిగిన డబ్బులు తీసుకొనే వెళ్తాడు. 


అనంతపురం జిల్లాలో కూడా ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆయన కూడా సిలిండర్ తీసుకొచ్చే వ్యక్తితో గొడవ పడ్డాడు. తాను 30 రూపాయలు ఇవ్వనంటే ఇవ్వనంటూ తెగేసి చెప్పాడు. దీంతో డెలివరీ బాయ్‌ తాను తీసుకొచ్చిన సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటనతో తిక్కరేగిన సదరు వినియోగదారు న్యాయపోరాటం చేశారు. అంతే లక్ష రూపాయలు జరిమానా విధించి కమిషన్. 


2019అక్టోబర్‌ 7న అనంతపురానికి చెందిన వ్యక్తి ఓ ఏజెన్సీలో హెచ్‌పీ గ్యాస్ బుక్ చేశారు. గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ 30 రూపాయలు ఇవ్వాలని కోరాడు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 30 రూపాయలు ఇవ్వడానికి వినియోగదారురు నిరాకరించడంతో సిలిండర్ డెలివరీ చేయకుండానే డెలివరీబాయ్ తిరిగి తీసుకెళ్లిపోయాడు. 


సిలిండర్ తిరిగి తీసుకెళ్లిపోవడంతో ఆగ్రహించిన వినియోగదారు పౌరసరఫరాల అధికారికి ఫిర్యాదు చేస్తే... వాళ్లు సీరియస్ అవ్వడంతో సిలిండర్‌ను ఏజెన్సీ వాళ్లు తీసుకొచ్చి ఇచ్చారు. 30 రూపాయలు అడుగుతున్నారని ఏజెన్సీకి చెబితే... సరఫరా ఖరర్చులు ఉంటాయని వాటనే అడుగుతారంటూ డెలివరీ బాయ్‌ను సమర్ధించారు. 


అక్కడితే ఈ వివాదం సద్దుమణింగిందని అంతా అనుకున్నారు. కానీ అక్కడే వివాదం మొదలైంది. 30 రూపాయలు ఇవ్వడానికి నిరాకరించిన వినియోగదారుడిని వేరే ఏజెన్సీకి బదిలీ చేస్తున్నట్టు గొడవ జరిగిన ఏజెన్సీ చెప్పింది. దీనిపై మండిపడ్డా వినియోగదారుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అదే టైంలో అనంతపురం జిల్లా వినియోగదారుల ఫోరానికి కూడా ఫిర్యాదు చేశారు. 


తనకు జరిగిన అన్యాయంతోపాటు ఏజెన్సీ చేసిన నిర్వాకాన్ని తెలియజేశారు. తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వినియోగదారుడి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన వినియోగదారరుల ఫోరం... గ్యాస్ ఏజెన్సీకి, ఏపీ పౌర సరఫరాల సంస్థకు నోటీసులు ఇచ్చింది. విచారణలో భాగంగా తాను సదరు గ్యాస్ డెలవరీ బాయ్‌ను తొలగించామని ఏజెన్సీ వాదనలు వినిపించింది. అందుకే వివాదం ముగిసిందని తాము ఎలాంటి నష్టపరిహారం చెల్లించాల్సిన పని లేదని వాదించింది. బాధితుడు కూడా గట్టిగానే వాదనలు వినిపించారు. 30రూపాయల వివాదంపై ఏజెన్సీకి ఫిర్యాదు చేస్తే సమర్థించారని గుర్తు చేశారు. 


ఇలా ఇరు పక్షాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరం ఏజెన్సీకి లక్ష రూపాయల జరిమానా విధించింది. బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది. ఇది కచ్చితంగా సేవలలో జరిగిన లోపమని అందుకే లక్ష చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యులరాలు శ్రీలత తీర్పు చెప్పారు.