Satya Sai District News: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజ చాంబర్ వద్ద వైసీపీ పార్టీ కౌన్సిలర్లు ఘర్షణ పడ్డారు. ఇంటి స్థల వివాదంపై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ కౌన్సిలర్ పై ఛైర్ పర్సన్ ఇంద్రజ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.


అసలేం జరిగిందంటే..?


హిందూపురం మున్సిపాలిటీలోని 29వ వార్డులో ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు కొట్టుకున్నారు. స్థల వివాదంపై అధికార పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు ఇర్షాద్, రోషన్ అలీ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే రోషన్ అలీ ఇంటి ఎదురుగా ప్రభుత్వ స్థలంలో, కౌన్సిలర్ ఇర్షాద్ ఇల్లు నిర్మిస్తున్నాడంటూ రోషన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటావా అంటూ ఆగ్రహించిన ఇర్షాద్ దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఇద్దరు కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అనంతరం మున్సిపల్ ఛైర్ పర్సన్ చాంబర్ లో ఘర్షణకు పాల్పడిన అసమ్మతి కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో 33వ వార్డు కౌన్సిలర్ శివకుమార్ మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజను ప్రశ్నించారు. ఒకే పార్టీకి చెందిన కౌన్సిలర్ ఇంటి నిర్మాణం చేపడుతున్నప్పుడు తోటి కౌన్సలర్ అని కూడా చూడకుండా ఎలా గొడవ పడతారంటూ శివ అడిగారు. అధికారులను పంపించి యంత్రాలను తీసుకెళ్లి కూల్చాలంటూ ఎలా ఆదేశిస్తారని ఇద్రజను అడిగారు.


ఒకరిపై ఒకరు ఫిర్యాదులు


దీంతో వెంటనే ఛైర్ పర్సన్ ఇంద్రజ.. కౌన్సిలర్ శివ కుమార్ తనను దాడి చేసేందుకు ప్రయత్నించాడని  హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ శివ ఘర్షణకు కారణమైన కౌన్సిలర్లతో పాటు మరికొంత మంది కౌన్సిలర్లతో కలిసి హిందూపురం పోలీస్ స్టేషన్ కు వచ్చి కౌంటర్ ఫిర్యాదు దాఖలు చేశారు. తన వద్ద పనిచేసే కార్యకర్తకు ఛైర్ పర్సన్ ఇంద్రజ భర్త శ్రీనివాసులు కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పుడు కూడా వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటూ.. గొడవ పడ్డారు. విషయం గుర్తించిన పోలీసులు మధ్యలోకి వచ్చి వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పలువురు ఆగకుండా దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారిని అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం మీద స్థల వివాదంలో ఒక్కసారిగా హిందూపురం మున్సిపల్ కౌన్సిలర్ల మధ్య వర్గ విభేదాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. విషయం తెలుసుకున్న నియోజకవర్గ పరిశీలకులు.. రెడ్డి ఈశ్వర్ రెడ్డి మరో రెండు రోజుల్లో హిందూపురం వస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో వైసీపీ కౌన్సిలర్లకు ఫోన్ చేసి...  తొందరపడొద్దు, ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన మాటను సైతం లెక్కచేయకుండా ఎవరికి వారే వేర్వేరుగా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.