ఎండు అల్లాన్ని మొఘల్ చక్రవర్తులు సౌంత్ లేదా సోంత్ అని పిలుస్తారు. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లోని ప్రజలు దీన్ని అలానే పిలుస్తారు. భారతీయ సుగంధ ద్రవ్యాల్లో ఇది కూడా ఒకటి. మొఘలులకు ఎండు అల్లం అంటే ఎంతో ఇష్టం. వండిన ప్రతి వంటకంలోనూ దీన్ని వేసి వండాల్సిందే. ఇది చైనాలో పుట్టిందని చెబుతారు, కానీ కొంతమంది దీని పుట్టిల్లు భారత దేశమే అంటారు. ఎండు అల్లం వాడడం అనేది ఐదు వేల సంవత్సరాల నుంచి ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతారు. క్రీస్తుపూర్వం ఏడు - ఎనిమిది శతాబ్దాలలో రచించిన ఆయుర్వేద గ్రంథం ‘చరక సంహితం’లో ‘హరిద్వర్గ’ అధ్యాయంలో ఈ సోంత్ ప్రస్తావన ఉంది. చైనా నుండి భారతదేశానికి వచ్చిన బౌద్ధ సన్యాసి షాహియాన్ తన పుస్తకంలో కూడా అల్లం గురించి వివరిస్తూ చైనా, భారత దేశంలో దాని సాగు గురించి రచించాడు. ఈ రెండు దేశాల వల్లే అల్లం ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాప్తి చెందింది. ఇప్పుడు భారతదేశం అల్లం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. అమెరికా, సౌదీ అరేబియా వంటి దేశాలకు మన దేశం నుంచే ఎగుమతి అవుతోంది అల్లం.మొఘల్ చక్రవర్తులు మన దేశాన్ని పరిపాలించిన కాలంలో అక్బర్ చక్రవర్తి ఆగ్రాలో అల్లాన్ని అధికంగా పండించేలా చేశారు. అలాగే అక్కడి నుంచి లాహోర్‌కు కూడా రవాణా చేసేవారు. ఎండు అల్లానికి పెద్ద మార్కెట్ అప్పట్లో లాహోర్లో ఉండేదని చెబుతారు.


ఆయుర్వేదంలో ముఖ్య పాత్ర
ఆయుర్వేదంలో పొడి అల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని చాలా ఔషధాలలో ఉపయోగిస్తారు. పొడి రూపంలో, కషాయం రూపంలో, మాత్రల రూపంలో, లేహ్యం రూపంలో కొన్ని సంవత్సరాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగిస్తున్నారు.  ఆయుర్వేద గ్రంథం చెబుతున్న ప్రకారం  ఎండు అల్లం పొడి గుండెకు మేలు చేస్తుంది. రక్తస్రావాన్ని నివారిస్తుంది. క్యాన్సర్ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. ఆహారంపై ఆసక్తి కలిగేలా చేస్తుంది. అందుకే ఎండు అల్లాన్ని రోజూ ఉపయోగించమని సూచిస్తుంది ఆయుర్వేదం.


ఎండు అల్లంతో ఇంటి చిట్కాలు
1. కడుపులో మంటగా ఉన్నప్పుడు అల్లం పొడిని కాస్త గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే వెంటనే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. గొంతు నొప్పి లేదా తలనొప్పి చికిత్స కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఎండు అల్లం పొడిని పేస్టులా తయారు చేసి తల పైన అప్లై చేసుకున్నా, గొంతు పైన అప్లై చేసుకున్నా నొప్పి తగ్గుతుంది. 
3.జలుబు నుండి వెంటనే ఉపశమనం కలగాలంటే ఎండు అల్లం పొడిలో కాస్త బెల్లం కలిపి భోజనం చేశాక తినాలి. 
4. బరువు తగ్గాలనుకునే వారికి కూడా పొడి అల్లం చాలా మేలు చేస్తుంది. దీనిలో ధర్మోజనిక్ ఏజెంట్లు అంటే వేడిని పెంచే పదార్థాలు ఉంటాయి. ఈ అల్లం పొడి శరీరంలోని కొవ్వుని కాల్చి బరువు తగ్గడానికి సాయం పడుతుంది. 


Also read: సమంత చేతిలో రుద్రాక్షమాల, మానసిక శక్తిని అందించే ఆ మాలతో ఆరోగ్య ప్రయోజనాలేన్నో












గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.