గుప్పు గుప్పుమని పొగ రాయుళ్ళు సిగరెట్లు తాగుతూ ఎంజాయ్ చేస్తారు. దాని వల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కానీ పొగ రాయుళ్లకి మాత్రం అవేమీ పట్టవు. ధూమపానం వల్ల కలిగే నష్టం గురించి ఒక షాకింగ్ అధ్యయనం బయటకి వచ్చింది. కొత్త అధ్యయనం ప్రకారం ధూమపానం చేసే వాళ్ళు జ్ఞాపకశక్తిని కోల్పోవడం, గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడైంది.


ది ఓహియో స్టేట్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో ధూమపానం, అభిజ్ఞా క్షీణత మధ్య సంబంధాన్ని మొదటిసారి గుర్తించారు. అల్జీమర్స్ వ్యాధి, డీమెన్షియాతో కూడా ధూమపానానికి సంబంధం ఉన్నట్లు గతంలో చేసిన పరిశోధనల ఆధారంగా దీన్ని రూపొందించారు. 45-59 సంవత్సరాల వయస్సులో ధూమపానం చేస్తున్న వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారు. స్మోకింగ్ అలవాటు మానుకోవడం మెదడు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


ధూమపానం వల్ల మెమరీ లాస్ 


ధూమపానం మానేయడం వల్ల శ్వాసకోశ, గుండె, నాడీ సంబంధిత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదని మెమరీ లాస్ నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. 45 అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన 1,36,018 మందిని పరిశీలించారు. వీరిలో 11 శాతం మంది మెమరీ లాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు నివేదించారు. అంటే ధూమపానం చేయని వారితో పోలిస్తే చేసే వారిలో అభిజ్ఞా క్షీణత 1.9 రెట్లు అధికంగా ఉంది. 10 ఏళ్ల క్రితమే ధూమపానం మానేసిన వారిలో మెమరీ లాస్ 1.5 రెట్లు ఉన్నట్లు తెలిపారు.


ఈ పరిశోధనలో ధూమపానం మానేసిన వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకున్నారు. స్మోకింగ్ మానేసిన సమయం కూడా ఈ అభిజ్ఞా క్షీణత ఫలితాలతో ముడి పడి ఉందని తెలిపారు. రెండు, మూడు నిమిషాలు ఇచ్చే కిక్కు కోసం సిగరెట్ కాల్చడం వల్ల శరీరంలోని ప్రధాన అవయవాలకి ముప్పు వాటిల్లితుంది. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, మధుమేహం వంటి రోగాలు వస్తాయని అందరికీ తెలుసు. కానీ సిగరెట్ పొగ కళ్ళని కూడా ప్రభావితం చేస్తుంది. కంటిలోని రక్త నాళాలపై పడే ప్రభావం కారణంగా దీర్ఘాకలికంగా కంటి చూపు పోయేలా చేస్తుంది.


సిగరెట్ తాగడం వల్ల గుండె కండరాలకి ఆక్సిజన్ తీసుకువెళ్ళే రక్తనాళాల్లో గడ్డలు, ఫలకాలు ఏర్పడటానికి కారణం అవుతుంది. దీని వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఇదే కాదు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే స్మోకింగ్ అలవాటు మానుకోవడం అన్ని విధాలుగా మంచిది. కానీ అది అంత సులువు కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ ప్రక్రియ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా అనిపిస్తాయి. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని సమతుల ఆహారం తీసుకుంటూ ధూమపానం వదిలించుకోవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మంచి నీళ్ళు పదే పదే వేడి చేస్తున్నారా? అది ఎంత డేంజర్ తెలుసా?