ABP  WhatsApp

Charles Sobhraj: 'బికినీ కిల్లర్' చార్లెస్ శోభ్‌రాజ్ విడుదల- వీడు మామూలోడు కాదు!

ABP Desam Updated at: 22 Dec 2022 12:03 PM (IST)
Edited By: Murali Krishna

Charles Sobhraj: కరుడుగట్టిన నేరస్థుడు చార్లెస్ శోభారాజ్‌ను విడుదల చేస్తూ నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.

(Image Source: Twitter)

NEXT PREV

Charles Sobhraj: సీరియల్‌ కిల్లర్‌ చార్లెస్‌ శోభ్‌రాజ్ (78)ను విడుదల చేస్తూ నేపాల్ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంకో కరుడుగట్టిన ఈ నేరస్థుడు 20 ఏళ్ల తర్వాత బయటకు వస్తున్నాడు. ప్రస్తుతం శోభారాజ్.. నేపాల్‌లో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు.


శిక్ష పూర్తి


నేపాల్‌లో 20 ఏళ్ల కారాగారవాసాన్ని జీవిత ఖైదుగా పరిగణిస్తారు. శిక్షాకాలంలో 75 శాతాన్ని పూర్తిచేసుకొని, సత్ప్రవర్తన కలిగి ఉన్న ఖైదీలను విడుదల చేసేందుకు అక్కడి చట్టాలు అనుమతిస్తాయి. దాన్ని ఆధారంగా చేసుకొని శోభ్‌రాజ్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీంతో అతడిని విడుదల చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది.


అంతేకాదు 15 రోజుల్లోగా శోభ్‌రాజ్‌ను విడుదల చేయాలని, వెంటనే అతని స్వదేశమైన ఫ్రాన్స్‌కు పంపించేయాలని కోర్టు ఆదేశించింది. 78 ఏళ్ల శోభ్‌రాజ్.. గుండె, దంత సమస్యల వంటి ఆరోగ్య కారణాలను చూపుతూ త్వరగా విడుదల చేయాలని అభ్యర్థించాడు. ఫ్రెంచ్ రాయబార కార్యాలయం దీని కోసం నేపాల్ ప్రభుత్వాన్ని సంప్రదించింది.


బికినీ కిల్లర్



  • శోభ్‌రాజ్.. భారత్‌, వియత్నాం మూలాలున్న ఫ్రాన్స్‌ వ్యక్తి.

  • 1970ల్లో అతను 15-20 మందిని హత్య చేసినట్లు అంచనా.

  • ఆసియా పర్యటనకు వచ్చే పాశ్చాత్య దేశాల పౌరులతో స్నేహం చేసి.. తర్వాత వారికి మత్తుమందులు ఇచ్చి చంపేవాడు.

  • అతడి చేతుల్లో హత్యకు గురైనవారిలో ఇద్దరి ఒంటిపై కేవలం బికినీలే కనిపించాయి. అందుకే అతణ్ని 'బికినీ కిల్లర్‌' అని కూడా పిలుస్తుంటారు.

  • నేపాల్‌లో 1975లో కానీ జో బ్రాంజిచ్‌ అనే అమెరికా మహిళను శోభ్‌రాజ్ చంపాడు. ఈ కేసులో 2003 నుంచి కాఠ్‌మాండూలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.


బాల్యం నుంచే


శోభ్‌రాజ్.. ఫ్రెంచ్-ఆక్రమిత సైగాన్‌లో భారతీయ వ్యాపారవేత్త వల్ల వియత్నాంకు చెందిన ఓ మహిళకు జన్మించాడు. అతని తల్లిదండ్రులు వివాహం చేసుకోలేదు. దీంతో శోభ్‌రాజ్‌ను కుమారుడిగా అతను ఎప్పుడూ చూడలేదు.


శోభ్‌రాజ్‌ తల్లి తర్వాత ఓ ఫ్రెంచ్ సైనికుడిని వివాహం చేసుకుంది. తర్వాత వీరు ఫ్రాన్స్‌కు వెళ్లిపోయారు. అయితే శోభ్‌రాజ్‌ గురించిన అనేక జీవిత చరిత్రలు, కథనాలలో తన తండ్రిపై అతను చాలా కోపంగా ఉండేవాడని పేర్కొన్నారు. తన తల్లి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కూడా శోభ్‌రాజ్‌.. కలవలేదు. దీంతో చిన్నచిన్న నేరాలకు పాల్పడుతూ టీనేజ్ నుంచే జైలు జీవితం అలవాటు చేసుకున్నాడు. 


సీరియల్ కిల్లర్


శోభ్‌రాజ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు వెళ్లాడు. ప్రయాణికులే లక్ష్యంగా చార్లెస్ అనేక హత్యలు చేశాడు. ముఖ్యంగా పాశ్చాత్య పర్యటకుల పానీయాల్లో మత్తుమందు కలిపి, తర్వాత హత్య చేసేవాడు. ఇలా శోభ్‌రాజ్ దాదాపు 20 హత్యలకు పాల్పడ్డాడు. అయితే ఎందుకు ఇలా హత్య చేస్తున్నాడనేది ఎవరికీ అంతు చిక్కలేదు. కొన్నిసార్లు తాను హత్య చేసిన వారి దగ్గర నుంచి పాస్‌పోర్ట్‌లను కూడా అతను దొంగలించాడు. 


అతనితో మాట్లాడిన జర్నలిస్టులు, అధికారులు కూడా శోభ్‌రాజ్‌ను చూసి ఆశ్చర్యపోయేవారట. ఎందుకంటే అతను చాలా సౌమ్యంగా ఉండేవాడట. పైకి ఇలా కనిపించడం వల్లే అతను ఈజీగా నేరాలు చేయగలిగాడని అధికారుల దర్యాప్తులో తేలింది. ఇన్ని హత్యలు చేసిన శోభ్‌రాజ్‌.. అనేక దేశాల్లో చాలా సార్లు అరెస్ట్ అయ్యాడు. కానీ జైలు నుంచి పారిపోవడం లేకపోతే లంచం ఇచ్చి బయటకు వచ్చేసేవాడు. 


భారత్‌లో అరెస్ట్


1976 జులైలో.. శోభ్‌రాజ్ సహా అతని ముగ్గురు మహిళా సహచరులను దిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది ఫ్రెంచ్ విద్యార్థులకు గైడ్‌లుగా పరిచయం చేసుకుని తర్వాత వారి తాగిన పానియంలో విషం కలిపేశాడు చార్లెస్. అయితే అందులో కొంతమంది విద్యార్థులు పోలీసులకు కాల్ చేయడంతో శోభ్‌రాజ్ దొరికిపోయాడు. ఈ కేసులో శోభ్‌రాజ్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అప్పటి తిహార్ జైలులో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఉన్న JP నైతానీ.. శోభ్‌రాజ్‌ ఎలా ఉండేవాడో తెలిపారు.



నేను జైలులో అతడ్ని బాగా అబ్లర్వ్ చేశాను. ఓ వైపు స్థానిక కోర్టులలో కేసుపై న్యాయ పోరాటం చేసేవాడు. మరోవైపు పాత్రికేయులు, న్యాయవాదులతో చాలా తెలివిగా మాట్లాడేవాడు. అంతేకాదు అతడ్ని చూసేందుకు చాలా మంది విదేశీ మహిళలు వచ్చేవారు. ప్రేమిస్తున్నామని, పెళ్లి చేసుకోవాలని శోభ్‌రాజ్‌ను అడిగేవారు. ఇలా అతని క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండేది.                 -    జేపీ నైతానీ, మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్, తిహార్ జైలు


నేపాల్‌లో


భారత్ నుంచి విడుదలైన తర్వాత.. శోభ్‌రాజ్ ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్ళాడు. తర్వాత 2003లో అతను నేపాల్‌కు వెళ్లాడు. అక్కడ అతను మళ్లీ అరెస్టయ్యాడు. నేపాల్‌లో 1975లో కానీ జో బ్రాంజిచ్‌ అనే అమెరికా మహిళను శోభ్‌రాజ్ హత్య చేసినందుకు ఆ దేశ కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. దీంతో ఈ కేసులో 2003 నుంచి కాఠ్‌మాండూలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తాజాగా అతడ్ని విడుదల చేస్తూ నేపాల్ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.


Also Read: PM Modi Meeting on Covid: రంగంలోకి ప్రధాని మోదీ- కొవిడ్ పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష


 


 

Published at: 22 Dec 2022 11:36 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.