Chandrababu News: కొంతమంది చేతగాని వ్యక్తులు ఏదేదో మాట్లాడుతున్నారని, రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలిపేస్తామని అంటున్నారని చంద్రబాబు అన్నారు. సిగ్గు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలు కలవాలంటున్నారని ఎద్దేవా చేశారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఇలా మాట్లాడబోరని అన్నారు. ప్రస్తుతం ఏపీలో విధ్వంసమే జరుగుతోందని అన్నారు. టీడీపీ హయాంలో వేసిన ఆర్థిక పునాదుల వల్లే తెలంగాణలో ఇప్పుడు అత్యధిక తలసరి ఆదాయం వచ్చిందని, ఏపీ మాత్రం ఇప్పుడు పాతాళానికి పడిపోయిందని అన్నారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన టీడీపీ విజయ శంఖారావం సభలో చంద్రబాబు మాట్లాడారు.


మళ్లీ వచ్చేయండి
తెలంగాణలో తెలుగు దేశాన్ని విడిచిపెట్టిన నాయకులంతా తిరిగి రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీడీపీకి పునర్‌వైభవం తెస్తామని చెప్పారు. అభివృద్ధిలో, సంక్షేమంలో తెలంగాణను ముందుకు తీసుకువెళ్దామని చెప్పారు. తెలంగాణలో టీడీపీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ లేకపోయినా ఖమ్మం సభకు ఇంత భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో పార్టీ మళ్లీ బలోపేతం అవుతుందన్న నమ్మకం, విశ్వాసం అందరిలోనూ కలుగుతోందని అన్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం తనకు వచ్చిందని అన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లపాటు ప్రతిపక్షనేతగా పని చేశానని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధి ముందుచూపుతో విజన్‌ 2020 పేరుతో ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ఎంతో శ్రమించానని చెప్పారు. మైక్రో సాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్‌ను ఎంతో కష్టపడి కలిసి, ఆయన్ను ఒప్పించి 14 నెలల్లో హైటెక్‌ సిటీని నిర్మించానని చెప్పారు. 50 ఇంజనీరింగ్‌ కళాశాలల సంఖ్యను 250కి పెంచి తెలుగువారిని దేశ విదేశాలకు వెళ్లి ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడేలా ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు. ఆనాడు ముందుచూపుతో హైదరాబాద్‌లో బయోటెక్నాలజీతో జీనోమ్‌ వ్యాలీని ఏర్పాటు చేయించడం ద్వారానే ప్రమాదకరమైన కరోనాకు ఇప్పుడు అక్కడి నుంచే మందులు కనుగొన్నారని చెప్పారు. 


ఖమ్మం అభివృద్ధి టీడీపీ వల్లే, ఆ కరకట్ట కూడా టీడీపీ హాయాంలోనే


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాను టీడీపీనే అభివృద్ధి చేసిందని చంద్రబాబు అన్నారు. ‘‘20 ఏళ్లకు ముందు భద్రాచలానికి వరదలు వచ్చేవి. 10 కిలోమీటర్లు, రూ.50 కోట్లు ఖర్చు పెట్టి కరకట్ట కట్టాం. ఆ కరకట్టే ఈ మధ్య వరదలు రాకుండా అడ్డుకోగలిగింది. ఆ రోజు కరకట్ట కట్టి ఉండకపోతే భద్రాచలం పరిస్థితి ఇప్పుడు మరోలాగా ఉండేది’’ అని చంద్రబాబు అన్నారు. ఖమ్మం జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ, రోడ్లన్నీ టీడీపీ హయాంలో చేపట్టినవే అని చంద్రబాబు అన్నారు. దుమ్ముగూడెం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఖమ్మం మెడికల్ కాలేజీ టీడీపీ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల్లో ఎస్ఆర్ఎస్పీ, దేవాదుల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లాంటి అన్ని ప్రాజెక్టులు టీడీపీ హాయాంలోనే తెచ్చామని అన్నారు.