మంచి నీళ్ళు వేడి చేసుకుని తాగడం ఎప్పుడూ సురక్షితమే. అది ఆరోగ్యానికి మంచిది కూడా. వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైయర్లు రాకముందు నేరుగా పంపుల నుంచి వచ్చిన నీటిని బాగా వేడి చేసుకుని వడకట్టుకుని తాగేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది ఉదయం లేవగానే నీళ్ళు వేడి చేసుకుని తాగుతున్నారు. అయితే ఒకసారి వేడి చేసిన నీటిని పదే పదే వేడి చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


పంపుల నుంచి వచ్చిన నీటిని వేడి చేసుకుని తాగి మిగతా వాటిని మళ్ళీ దాహంగా అనిపించినప్పుడు వేడి చేస్తూ ఉంటారు కొంతమంది. లేదంటే ఆ మిగిలిపోయిన నీళ్ళలో మరికొన్ని చన్నీళ్ళు కలిపి వేడి చేస్తారు. కానీ నీటిని అన్ని సార్లు వేడి చేయడం వల్ల అందులోని లవణాల సంఖ్య పెరిగిపోతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.


నీటిలో ఉండే లవణాలు ఏంటి?


నైట్రేట్స్: కరిగే గుణం కలిగిన ఇది సాధారణంగా హానికరం కాదు. అయితే ఎక్కువ సేపు నీటిని వేడి చేస్తే మాత్రం అవి విషపూరితం అవుతాయి. క్యాన్సర్, లుకేమియా, నాన్ హాడ్కిన్ లింఫోమా వంటి ప్రమాదకరమైన, ప్రాణాంతక వ్యాధులకి కారణం కావచ్చు.


ఆర్సేనిక్: ఇది తక్కువ మొత్తంలో ఉంటే హానికరం కాదు. అయితే ఇది పంపు నీటిలో పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆర్సెనిక్ క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు, మానసిక రుగ్మతలను కలిగిస్తుంది. అధిక మొత్తంలో ఆర్సెనిక్ ఉన్న నీటిని తాగితే అది ప్రసరణ వ్యవస్థతో పాటు చర్మాన్ని కూడా దెబ్బతీస్తుంది.


ఫ్లోరైడ్: పంపు నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బోలు ఎముకల వ్యాధి, పగుళ్లు, నొప్పులు వంటి రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. చిన్న పిల్లల్లో అధిక ఫ్లోరైడ్ వినియోగం వల్ల దంతాల మీద ఎనామిల్ దెబ్బతింటుంది.


కాల్షియం: ఎముకలకి కాల్షియం అవసరం. కానీ నీళ్ళని మరిగించడం వల్ల అందులోని కాల్షియం మొత్తాన్ని పెంచుతుంది. ఇది మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్ళని కలిగిస్తుంది.


లెడ్: సీసం నీటి నుంచి రాదు. ఇది పాత పైపుల నుంచి నీటిలోకి చేరి కలుషితం అవుతుంది. సీసం తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయి.


నీళ్ళు ఎక్కువ సార్లు వేడి చేయడం వల్ల అనార్థాలు


హార్డ్ వాటర్ ని మళ్ళీ మరిగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. సాధారణంగా మంచి నీటిలో వేడి చేసేటప్పుడు గ్యాస్ బుడగలు ఉంటాయి. ఇవి మరిగించే సమయంలో న్యూక్లియేషన్ సైట్ గా పని చేస్తాయి. మళ్ళీ అవే నీటిని వేడి చేయడం వల్ల నీటిలో కరిగిన వాయువులు బయటకి పంపుతుంది. అంతే కాదు వాటి రుచి కూడా మారిపోతుంది. వేడి చేసిన నీటితో తయారు చేసే ఆహారం, పానీయాల రుచిని ప్రభావితం చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: బ్యాక్టీరియాలను అడ్డుకునే లిప్‌స్టిక్ ! శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ