ఊబకాయం ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద సమస్యలా మారింది. ఒబేసిటీ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2.8 మిలియన్ల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాలు చెబుతున్నాయి. ఊబకాయం అనేది ఒకప్పుడు అధిక ఆదాయ దేశాల్లోనే ఎక్కువ కనిపించేది. కానీ మారుతోన్న జీవనశైలి, ఇతరత్రా కారణాల వల్ల ప్రస్తుతం తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాలలో కూడా ప్రబలంగా మారింది. 1975 నుంచి చూస్తే ఊబకాయం మూడు రెట్లు పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్ వల్ల మారిన జీవనశైలి వల్ల కూడా చాలా మందిలో ఊబకాయం సమస్య ఏర్పడింది. 


ఊబకాయం అంటే?


శరీరం బరువును సూచించే బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అధికంగా ఉంటే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. అన్ని వయసుల వారిలోనూ ఈ సమస్య కనపడుతోంది. పురుషుల కంటే మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన అంశాల వల్ల కొందరిలో అధిక బరువు సమస్య వస్తుంది. అయితే గత దశాబ్ద కాలంగా చూసుకుంటే.. జీవనశైలి మార్పులతో ఊబకాయం సమస్య చాప కింద నీరులా విస్తరిస్తోందని నర్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. 



Also Read: బిడ్డకు తల్లిపాలు ఇవ్వకపోతే అంత ప్రమాదమా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి


అధిక బరువు కారణంగా గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. హార్మన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఆహార నియామాలపై అశ్రద్ధ వహించడం, వ్యాయామం చేయకపోవడం వల్ల ఒబేసిటీ సమస్య పెరిగిపోతుంది. ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల కూడా ఒబేసిటీ పెరుగుతోంది. ఆటలు ఆడకపోవడం, తీవ్రమైన ఒత్తిడి వల్ల కూడా అధిక బరువు వచ్చే సమస్య ఉంది. 


ఒబేసిటీతో ఇన్ని సమస్యలా?
అధిక బరువు ఎల్లప్పుడూ అనారోగ్య కారకమేనని పలు అధ్యయనాల్లో తేలింది. ఒబేసిటీ కారణంగా డయాబెటిస్, రక్త పోటు వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. ఇక కొలస్ట్రాల్ వల్ల గుండెకు అందే రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడి గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మోకాళ్ల నొప్పులు, థైరాయిడ్, పీసీఓడీ, గర్భాదారణలో సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అధిక బరువుతో చాలా మంది డిప్రెషన్ బారిన పడుతున్నారని పేర్కొన్నారు. 


ఎక్కువ ప్రోటీన్లు అవసరం..
అధిక బరువు బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామంతో కూడా ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు. 


Also Read: Dementia: కాలుష్యం ఇంత పనిచేస్తుందా? వామ్మో మతి పోగొట్టేసిందిగా..