కాలుష్యం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు, రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయనే విషయం తెలిసిందే. కానీ వాయు కాలుష్యం కారణంగా మతిమరుపు కూడా వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. గాలి నాణ్యతకు, తీవ్రమైన మతిమరుపు (డిమెన్షియా) వ్యాధికి సంబంధం ఉందని వెల్లడైంది. అమెరికాలోని కైసర్ పర్మినెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ (యూడబ్ల్యూ) కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. 



దీనికిగానూ ప్యూజెట్ సౌండ్ రీజియన్ అనే ప్రాంతంలో రెండు ప్రాజెక్టులకు సంబంధించిన డేటాను విశ్లేషించారు. వాయు కాలుష్యాన్ని అంచనా వేసేందుకు సీటెల్ ప్రాంతంలో 1970ల చివరిలో ప్రారంభమైన ఒక ప్రాజెక్టును.. డిమెన్షియా వ్యాధి తీవ్రత తెలుసుకునేందుకు 1994లో ప్రారంభం అయిన మరో ప్రాజెక్టును ఎంచుకున్నారు. దీంతో పాటు ఇదే ప్రాంతంలో నివసించే 4000 మందిని పరిశీలించారు. వీరిలో 1000 మందికి పైగా డిమెన్షియా వ్యాధి బాధితులుగా మారినట్లు గుర్తించారు. ఈ ఫలితాల ద్వారా వాయు కాలుష్యానికి, డిమెన్షియా వ్యాధికి సంబంధం ఉన్నట్లు తేల్చారు.  



ఉదాహరణకు ఒక వ్యక్తికి 72 సంవత్సరాల వయస్సులో డిమెన్షియా వచ్చినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం 62 ఏళ్ల వయసున్న వారు పదేళ్ల తర్వాత 73కి చేరతారు. కాబట్టి ప్రస్తుతం 62 ఏళ్లు ఉన్న వారి వద్ద కాలుష్య పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలను పదేళ్ల పాటు పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో కాలుష్య స్థాయి ఏటేటా మారుతుంటుంది. అందువల్ల ప్రతి ఏటా వీరి ఆరోగ్య పరిస్థితులను నమోదు చేసుకున్నారు. వీటి ఆధారంగా వారు ఒక అంచనాకు వచ్చారు. 


Also Read: Health Benefits: కుంకుమపువ్వు కేవలం గర్భిణులే కాకుండా ఇంకా ఎవరైనా తినొచ్చా? ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా
వాతావరణంలో కాలుష్య స్థాయిలు పీఎం 2.5 కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు డిమెన్షియా ముప్పు స్వల్పంగా పెరిగనట్లు గుర్తించారు. ఒక క్యూబిక్ మీటర్ ఎక్స్‌పోజర్‌కు ఒక మైక్రోగ్రామ్ మేర రేణువులు పెరిగినా కూడా డిమెన్షియా వచ్చే ప్రమాదం 16 శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నట్లు పరిశోధనకు నాయకత్వం వహించిన రేచెల్ షాఫర్ వెల్లడించారు. దీనికి అల్జీమర్స్‌ తరహా డిమెన్షియాకు సంబంధం ఉన్నట్లు చెప్పారు. 


డిమెన్షియా అనేది ఒక్క రోజులోనే వచ్చే వ్యాధి కాదని.. దీనికి కొన్నేళ్ల సమయం పడుతుందని పరిశోధనలో పాల్గొన్న షెఫర్ వెల్లడించారు. అందుకే ఒక్కో వ్యక్తిని దశాబ్ద కాలం పాటు పరీక్షించామని చెప్పారు. ఈ పరిశోధన వివరాలు ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్‌పెక్టివ్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. 


Also Read: Diabetes Symptoms: డయాబెటిస్.. యమ డేంజర్, ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!