కుంకుమపువ్వు తినని వారుంటారు కానీ…వినని వారుండరు. ఎంత ప్రత్యేకత కుంకుమపువ్వు సొంతం. పురాతన కాలం నుంచి ఇది వాడుకలో ఉంది. అప్పట్లో ఈజిప్ట్ యువరాణి చర్మ సౌందర్యం, కేశ సౌందర్యం కోసం కుంకుమపువ్వు వాటర్‌లో వేసి స్నానం చేసేదట. అయితే కుంకుమపువ్వు అత్యంత ఖరీదైన సుగంధద్రవ్యం కావడంతో కొందరు మాత్రమే వాడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు నిత్యం పాలలో కుంకుమపువ్వు తీసుకుంటే అందమైన పిల్లలు పుడతారని కొందరి నమ్మకం. అయితే కుంకుమపువ్వు వల్ల అందమైన పిల్లలు పుడతారో లేదో కానీ… దీన్ని నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.




కుంకుమ పువ్వులో ఉన్న మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజనాలేంటంటే….


ఒత్తిడి, ఆందోళ‌న‌ తగ్గిస్తుంది


ఒత్తిడి, ఆందోళన త‌గ్గించేందుకు కుంకుమపువ్వు ఉపయోగపడుతుంది. ఇందులో పైటోకెమిక‌ల్స్‌, ఫెనోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మెదడుకు అవ‌స‌ర‌మైన సెరోటోనిన్‌ను అందించ‌డంలో స‌హాయ‌ప‌డతాయి. అందుకే ఎక్కువ ఒత్తిడికి గురయ్యేవారు పాలల్లో కుంకుమపువ్వు కలుపుకుని తాగితే వెంటనే ఒత్తిడి తగ్గుతుందంటారు.


క్యాన్స‌ర్ దరి చేరదు


శ‌రీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. అయితే ఈ ఫ్రీ రాడిక‌ల్స్ పెర‌గ‌కుండా చూసే యాంటీ ఆక్సిడెంట్లు కుంకుమపువ్వులో ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే రోజూ కుంకుమపువ్వు తీసుకునేవారిలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉండదు.


బ‌రువు తగ్గేందుకు సహకరిస్తుంది


జీవక్రియ‌ను నియంత్రించ‌డంలో, బరువు తగ్గేలా చేయడంలో కుంకుమపువ్వుది కీలకపాత్ర. రోజూ కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఆహారం తక్కువ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.


నిద్ర‌లేమి అనే మాటే ఉండదు


ప‌డుకునే ముందు పాల‌ల్లో కుంకుమ పువ్వు క‌లుపుకుని తాగితే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం. ఇందులో మాంగ‌నీస్ అధికంగా ఉంటుంది. ఇది శ‌రీరానికి ప్ర‌శాంత‌త చేకూర్చి త్వ‌ర‌గా నిద్ర‌పోయేలా చేస్తుంది.





అద్భుతమైన జ్ఞాప‌క‌శ‌క్తి


కుంకుమ పువ్వులో క్రోసిన్ అనే ప‌దార్థం జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. పాల‌ల్లో కుంకుమపువ్వు వేసుకుని తాగ‌డం ద్వారా ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది.


హృద్రోగాలు వచ్చే అవకాశం తగ్గుతుంది


కుంకుమ పువ్వులో క్రోసిటిన్, యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి ర‌క్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. ఫ‌లితంగా హృద్రోగాలు వ‌చ్చే అవ‌కాశం కూడా త‌గ్గుతుంది.


కీళ్ల నొప్పుల‌కు దివ్య ఔషధం


కీళ్ల నొప్పులు, ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ కుంకుమ పువ్వు స‌హాయ‌ప‌డుతుంది. ఆస్త‌మా, కోరింత ద‌గ్గు ఇలా ప‌లు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ ఉప‌యోగ‌ప‌డుతుంది.


రుతుక్రమ సమస్యలకు చెక్


రుతుక్ర‌మ సంబంధిత స‌మ‌స్య‌ల‌కు కుంకుమ పువ్వు చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. అధిక ర‌క్త‌స్రావం వంటి స‌మ‌స్య కూడా ఉండ‌దు


పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం


 వీర్య క‌ణాలు తక్కువ ఉన్న‌వారు రోజూ కుంకుమ పువ్వును తీసుకోవ‌డం వ‌ల్ల స‌త్ఫ‌లితాలు క‌నిపిస్తాయి. బాదం పాల‌ల్లో కుంకుమ పువ్వును క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల సంతానోత్ప‌త్తి సామ‌ర్థ్యం పెరుగుతుంది.




మరి మార్కెట్లో ఎక్కడంటే అక్కడ కుంకుమపువ్వు అమ్మేస్తున్నారు. వాటిలో ఏది అసలు-ఏది నకిలీ గుర్తించడం ఎలా అంటారా…. చిటికెడు కుంకుమ పువ్వును గోరువెచ్చ‌ని నీళ్లు లేదా గోరువెచ్చ‌టి పాలల్లో వేయాలి. వెంటనే రంగు మారితే అది అస‌లైనది కాదు. ఎందుకంటే అస‌లైన కుంకుమపువ్వు మిశ్రమం ఎరుపు నుంచి బంగారు రంగుకు రావ‌డానికి క‌నీసం 15 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది.