పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు తప్పనిసరి అని అంటారు. ఒక వేళ తల్లిపాలను తాగకపోతే ఆ బిడ్డ ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారనే విషయంపై చాలామందికి అవగాహన ఉండదు. World Breastfeeding Week నేపథ్యంలో మీరు తప్పకుండా తల్లిపాల ప్రత్యేకతలు గురించి తెలుసుకుని.. ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలు, గర్బిణీ స్త్రీలు తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాలి. 


మాతృత్వం అనేది చక్కని అనుభూతి. నవ మాసాలు మోసి.. నొప్పులను ఓర్చుకుంటూ.. ఎంతో కష్టమైనా ఇష్టంగా పసిబిడ్డకు జన్మనిచ్చే తల్లులు చనుబాలు విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదు. బిడ్డకు తల్లిపాలు ఇచ్చినప్పుడే మాతృత్వానికి సంపూర్ణత లభిస్తుంది. తల్లిపాలు లోపిస్తే భవిష్యత్తులో పిల్లలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 


ఏడాది వరకు తల్లిపాలు పట్టవచ్చు: కొంతమంది తల్లలు తమ అందం దెబ్బతింటుందనే కారణంతో శిశువులకు తల్లిపాలను ఇవ్వకుండా ఆపేస్తారు. ఫలితంగా భవిష్యత్తులో పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పసిబిడ్డకు కనీసం 8 నెలలు పాలివ్వాలి. కొంతమంది పిల్లలు సుమారు రెండేళ్ల వయస్సుకు కూడా పాలు తాగుతారు. అలా తాగడం వల్ల తల్లికి, బిడ్డకు లాభమే గానీ ఎలాంటి నష్టం ఉండబోదు. కాబట్టి నిరభ్యంతరంగా శిశువులకు పాలివచ్చు. అందం కోసం ఆలోచించి శిశువు ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసమో తల్లులు ఆలోచించాలి. 


తల్లిపాలు లోపిస్తే ఏం జరుగుతుంది?: తల్లిపాలు లోపించడం వల్ల శిశువులు ఆకస్మిక మరణానికి గురయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా కొంతమంది పిల్లలకు ఆకస్మిక శిశు మరణ లక్షణాలు (Sudden infant death syndrome - SIDS) కనిపిస్తాయి. దీనివల్ల శిశువు ఆకస్మికంగా చనిపోయే ప్రమాదం ఉంది. దీన్ని ఎదుర్కొనే శక్తి కేవలం తల్లిపాలకు మాత్రమే ఉంటుంది. బిడ్డ ఎదుగుదలకు కావల్సిన అన్నిరకాల పోషకాలను కేవలం తల్లిపాలు మాత్రమే అందించగలవు. 


తల్లిపాల వల్ల శిశువు కలిగే లాభాలేమిటీ?: తల్లిపాలు తాగే పిల్లల్లో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. అంతేగాక దృష్టి లోపాలు కూడా దరిచేరవు. తల్లిపాల వల్ల శిశుకు కడుపు నిండి బాగా నిద్రపోతాడు. ఎలాంటి జీర్ణ సమస్యలు కూడా ఉండవు. అంతేకాదు.. తల్లిపాలు పిల్లల్లో క్యాన్సర్‌తోపాటు లింఫోబ్లాస్టిక్ లుకేమియా, హాడ్కిన్స్ తదితర వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది. తల్లిపాల వల్ల పిల్లలకు తగిన కాల్షియం లభిస్తుంది. కాబట్టి ఎముకలు, దంత సమస్యలు దరిచేరవు. 


తల్లికి కూడా మేలే: శిశువుకు పాలివ్వడం వల్ల తల్లులకు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పాలిచ్చే తల్లులు టైప్-2 డయాబెటీస్ సమస్య నుంచి బయటపడవచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి. పాలివ్వడం వల్ల కొంతమంది మహిళలు బరువు కూడా తగ్గుతారని పరిశోధకులు తెలుపుతున్నారు. ప్రసవం తర్వాత కలిగే సమస్యలను కూడా పాలివ్వడం ద్వారా నివారించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  సైతం చనుబాలివ్వడం శిశువుకు మాత్రమే కాకుండా తల్లికి కూడా మేలు చేస్తుందని స్పష్టం చేసింది. 


తల్లిపాల వారోత్సవాలు ఎందుకు?: తల్లిపాల లోపం వల్ల ఎంతో మంది పిల్లలు పుట్టగానే చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో WHO, UNICEF తదితర సంస్థలు సంయుక్తంగా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ (WABA) పేరిట 1990 నుంచి అవగాహణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి వారం రోజులు వరకు ‘వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ (WBW) నిర్వహిస్తున్నారు. ప్రజల్లో బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం.