ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమ సహచరులు కనుమరుగవుతున్నారని, ఉద్యమ ద్రోహులు రాజ్యమేలుతున్నారంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర రాజకీయ పార్టీలు ప్రజలను నమ్ముకుంటాయి కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం డబ్బులను నమ్ముకున్నారని ఈటల ఆరోపించారు. గతంలో మానుకోటలో ఓదార్పు కార్యక్రమం చేపట్టగా ఉద్యమకారులపై రాళ్లతో దాడిచేశారంటూ మండిపడ్డారు. రాళ్లతో దాడి చేసి ఉద్యమకారుల రక్తాన్ని కళ్ల చూసిన పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి ఉద్యమ కారులను అవమానించారని వ్యాఖ్యానించారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర (Huzurabad Padyatra) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత వారం జ్వరం, బీపీ లెవెల్స్ తగ్గిపోవడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించి అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అనారోగ్యం నుంచి కోలుకుని నేటి ఉదయం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియా (Eatala Rajender Pressmeet)తో మాట్లాడారు. రాజకీయ పార్టీలు ప్రజలను నమ్ముకుని ముందుకు సాగాలని కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం నగదును నమ్ముకుని పావులు కదుపుతున్నారని ఈటల అన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్‌లో కొనుగోళ్ల పర్వానికి సీఎం కేసీఆర్ తెరలేపారని ఆరోపించారు. ఇప్పటికే రూ.150 కోట్లు నగదును హుజురాబాద్ నియోజకవర్గం నేతలు, కార్యకర్తలకు ఇచ్చారని.. ఇలాంటి రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు.
Also Read: Huzurabad Byelection : హడావుడిగా పథకాల అమలు ! ఏ క్షణమైనా హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ రాబోతోందా..?
ఇప్పుడు మాత్రమే కాదని గత ఎన్నికల్లోనూ తనను ఓడించేందుకు భారీ కుట్ర జరిగిందని ఈటల ఆరోపించారు. త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్ నగదు వెదజల్లుతున్నారని, ఇలాంటి వ్యక్తులకు అధికారం అవసరమా అంటూ మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే రూ.150 కోట్లను నగదు ఖర్చు చేశారన్నారు. నియోజకవర్గంలోని నేతలకు ఖరీదు కొట్టి కొనుగోళ్లు, ప్రలోభ పర్వానికి తెరలేపారని చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నికలు అనగానే హామీలు గుర్తొచ్చాయని, అందుకోసమే కొత్త కొత్త పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగభృతిని తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను మాజీ మంత్రి ఆటల డిమాండ్ చేశారు.
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. అనంతర కాలంలో సీఎం పదవి ఇవ్వకపోగా, ఉన్న డిప్యూటీ సీఎం పదవిని సైతం లాగేసుకున్నారని గుర్తుచేశారు. దళిత బంధు పేరుతో దళితుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వడంపై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఈ పథకాన్ని తాను స్వాగతిస్తున్నునట్లు చెప్పారు. కానీ గత ఏడేళ్ల కాలంలో ఒక్కనాడు సైతం రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు కేసీఆర్ దండ వేయలేదని గుర్తుచేశారు. త్వరలోనే తన పాదయాత్ర ‘ప్రజా దీవెన యాత్ర’ను తిరిగి కొనసాగిస్తానని ఈటల రాజేందర్ తెలిపారు.