2021 ఆగస్టు 5 యావత్తు భారతదేశం ఎన్నేళ్ల నుంచో కలలుకంటున్న కల సాకారమైన రోజు. ఇంతకీ ఆ కల ఏంటంటే... విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో పతకం గెలవాలన్నది. 41సంవత్సరాల తర్వాత పురుషుల హాకీ జట్టు ఈ రోజు(గురువారం) జర్మనీపై విజయం సాధించి కాంస్యం పతకం దక్కించుకుంది. దీంతో 41ఏళ్ల భారతీయుల కల నిజమైంది. పతకం కాంస్యమే అయినా అది స్వర్ణంతో సమానం.
ఒలింపిక్స్ హాకీలో భారత పురుషుల జట్టుది ఘనమైన చరిత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఏకంగా ఎనిమిది స్వర్ణాలు దక్కించుకుంది. కానీ, ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ... 1980 క్రీడల తర్వాత మన ప్రదర్శన పడిపోతూ వచ్చింది. ఈ 41 ఏళ్లలో ఒక్క పతకం కూడా గెలవలేదు. కొన్నిసార్లు గ్రూప్ మ్యాచ్‌ల్లోనే ఓడిపోయి తిరిగి వచ్చేది. టోక్యో ఒలింపిక్స్‌లో మంచి అంచనాలతో అడుగుపెట్టింది భారత పురుషుల హాకీ జట్టు.
అమ్ములపొదలోని అస్త్రాలన్నింటినీ ఉపయోగించింది భారత జట్టు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించింది. జర్మనీతో జరిగిన కాంస్య పోరులో చిరస్మరణీయ విజయం అందించింది. బలమైన ప్రత్యర్థి జర్మనీని 5-4 తేడాతో ఓడించింది. టీమ్‌ఇండియా నుంచి సిమ్రన్ జీత్ సింగ్ (17, 34 ని), హార్దిక్ సింగ్ (27ని), హర్మన్‌ప్రీత్ సింగ్ (29ని), రూపిందర్ పాల్ సింగ్ (31ని) గోల్స్ సాధించారు. జర్మనీ తరఫున టిముర్ ఒరుజ్ (2ని), నిక్లాస్ వెలెన్ (24ని), బెనెడిక్ట్ ఫర్క్ (25ని), లుకాస్ విండ్‌ఫెదెర్ (48ని) రాణించారు.
ఒలింపిక్స్‌లో స్వర్ణం, రజతం, కాంస్యం... పతకం కోసం ఏ పోరైనా నువ్వా నేనా అన్నట్లు అంటుంది. సరిగ్గా అలాంటి పోరు ఇలాగే జరిగింది. కాంస్య పోరులో భారత్xజర్మనీల మధ్య మ్యాచ్ చూస్తే క్రికెట్లో ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ ఓవర్ ఎలా జరిగి ఉత్కంఠకు గురిచేసిందో... అంతటి ఉత్కంఠ ఈరోజు హాకీ మ్యాచ్లో చూశాం. స్వర్ణ పతకం కోసం ఆటగాళ్లు ఎలా హోరాహోరీగా పోరాడుతారో... అలాగే భారత్Xజర్మనీ జట్లు ఈ రోజు కాంస్య పోరులో తలపడ్డాయి. ఎలాగైనా పతకం గెలవాలన్న కసి భారత ఆటగాళ్లలో స్పష్టంగా కనిపించింది.
సెమీస్ వరకూ భారత జట్టు మంచి ప్రదర్శనే చేసింది. కానీ, సెమీఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతిలో భారత్ ఓడింది. దీంతో ఫైనల్ చేరాలనుకున్న భారత కలలకు గండి పడింది. బెల్జియం మ్యాచ్ లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని, డిఫెన్స్ బాగా మెరుగుపరుచుకుని భారత్ ఈ రోజు మ్యాచ్ కోసం బరిలోకి దిగింది. రియోలో కాంస్యం గెలిచిన జర్మనీని మనవాళ్లు తక్కువ అంచనా వేయలేదు.
ఈ పతకం వారికి అంకితం
కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు సారథి మన్‌ప్రీత్ తమ జట్టు సాధించిన కాంస్య పతకం కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్లకు అంకితం చేసినట్లు తెలిపాడు. తమను సేఫ్‌గా చూసుకుంటోన్న డాక్టర్లు, సైనికులకు ఈ పతకం అంకితమన్నాడు.
శుభాకాంక్షల వెల్లువ
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన హాకీ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు.