అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ . ఇప్పుడే కాదు. ఏపీలో ప్రభుత్వం మారినప్పటి నుండి ఎప్పుడూ ఏదో విషయంలో హైలెట్ అవుతూనే ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత మరీ ఎక్కువ. 2019 ఎన్నికలకు ముందు వరకు తాడిపత్రి అంటే జేసీ బ్రదర్స్ అడ్డా. అన్న జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే తమ్ముడు ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఉండేవారు. 2014ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా గెలిస్తే.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అలా దశాబ్దాలుగా పట్టు నిలుపుకుంటూ వచ్చిన నియోజకవర్గంలో వారికి తొలిసారిగా 2019 ఎన్నికల్లో షాక్ తగిలింది. జేసీ బ్రదర్స్‌కు ఇప్పటికీ ఓటమి లేదు. గత ఎన్నికల్లో ఇద్దరూ వారసులకు అవకాశం ఇచ్చి తాము సైడయ్యారు. కానీ ఆ వారసులకు తొలిసారే ఎదురుదెబ్బ తగిలిగింది. అప్పట్నుంచి మళ్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. లేకపోతే తన వర్గం అంతా చెల్లాచెదురు అయిపోతుందని జేసీ బ్రదర్స్ భావించడమే దీనికి కారణం. ఎందుకంటే.. అవతలి వైపు ఎమ్మెల్యేగా గెలిచింది కేతిరెడ్డి పెద్దారెడ్డి. కేతిరెడ్డి వర్సెస్ జేసీ పోరాటం దశాబ్దాల నాటిది మరి.
కాంగ్రెస్‌లోనే రెండు గ్రూపులు.. సూరీడు వర్సెస్ జేసీ బ్రదర్స్
రాయలసీమలో 1980ల్లో ఫ్యాక్షన్ రాజకీయాలదే ఆధిపత్యం. ఆ తర్వాత దశాబ్దంన్నర కాలంలో ఎంతో మంది ప్రముఖ నేతలు కూడాప్రాణాలు కోల్పోయారు. అలాంటి ఫ్యాక్షనిజం తాడిపత్రిలోనూ ఉండేది. కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి అలియాస్ సూరీడు వర్సెస్ జేసీ బ్రదర్స్ అన్నట్లుగా పోరాటం సాగేది. ఈ రెండు గ్రూపులు కాంగ్రెస్‌లోనే ఉండేవి. కానీ ఆధిపత్య పోరాటంలో కేతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి తర్వాత టీడీపీలో చేరారు. 2004లో సూర్యప్రతాప్ రెడ్డి .. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి జేసీ దివాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 2006లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి తాడిపత్రి వచ్చిన సూర్యప్రతాప్ రెడ్డిని రైల్వే స్టేషన్‌లోనే తెల్లవారుజామున కాపు కాసి హత్య చేశారు. అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ఫ్యాక్షన్ ను ఇంతటితో ముగించాలనుకున్న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాధ్యత తీసుకుని.. ఇరు వర్గాల మధ్య రాజీ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో గట్టి ప్రచారం ఉంది. ఆ రాజీ ప్రకారం కేతిరెడ్డి కుమారుడు వెంకట్రామిరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని ధర్మవరం నియోజకవర్గ బాధ్యతలు ఇస్తారు. సూర్యప్రతాప్ రెడ్డి సోదరుడు రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఎవరూ తాడిపత్రిలో వేలు పెట్టకూడదు... అని రాజీ ఫార్ములా అనేది ఆనాటి నేతలు చెప్పేమాట. ఆ ప్రకారమే.. ఆ తర్వాత తాడిపత్రిలో కేతిరెడ్డి కుటుంబీకులుఎవరూ వేలు పెట్టలేదు. కేతిరెడ్డి కుమారుడు వెంకట్రామిరెడ్డికి ధర్మవరం ఎమ్మెల్యే టిక్కెట్‌ను 2009 ఎన్నికల్లో వైఎస్ ఇప్పించారు. ఆయన గెలిచారు. 2014లో ఓడిపోయారు. తర్వాత వైసీపీ తరపున మళ్లీ పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ధర్మవరం ఎమ్మెల్యే ఆ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సూరీడు కుమారుడే.
Also Read: MGNREGA Bill: బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు.. కోర్టు ఆదేశాల ఉల్లంఘన సరికాదు.. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
వైఎస్ ఉన్నంత కాలం ఈ ఫార్ములా వర్కవుట్ అయింది. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. 2014లో జేసీ బ్రదర్స్‌ను ఓడించాలనుకున్నా వైసీపీకి సాధ్యం కాలేదు. దాంతో ఆయన 2019 ఎన్నికల నాటికి కేతిరెడ్డి పెద్దారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. తాడిపత్రి బాధ్యతలు ఇచ్చారు. ఇది జేసీ సోదరులను మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. గత ఒప్పందాలను కేతిరెడ్డి కుటుంబం అతిక్రమించిందని ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రారంభించారు. 2018సంవత్సరంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామంలోకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంటరయ్యారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తాడిపత్రి నియోజకవర్గంలో ఉండదు. రిజర్వుడు నియోజకవర్గమైన శింగనమలలో ఉంటుంది. ఆ గ్రామంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి ఇల్లు కొన్నారు. అట్ట హాసంగా గృహప్రవేశం చేశారు. ఆ సమయంలో.. పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేతిరెడ్డి తనకు సంబంధం లేని తాడిపత్రికి వస్తే... తాను పెద్దారెడ్డి స్వగ్రామానికి రాలేనా అని అప్పుడు ఆయన సవాల్ చేశారు.
జేసీ ఇంట్లోకి వెళ్లి పెద్దారెడ్డి వీరంగం..
తర్వాతి కాలంలో ప్రభుత్వం మారింది. తాడిపత్రి నుంచే పోటీ చేసి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. నువ్వు నా స్వగ్రామంకి వస్తే.. నేను నీ ఇంట్లోకి రాలేనా అన్నట్లుగా పెద్దారెడ్డి చెలరేగిపోయారు. కొద్ది రోజుల క్రితం జేసీ ఇంట్లోకి వెళ్లి వీరంగం సృష్టించారు. ఇప్పుడు అధికారం పెద్దారెడ్డి చేతిలో ఉంది. దాంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేయలేకపోయారు. కానీ సై అంటే సై అంటున్నారు. అధికారం చేతిలో లేకపోయినా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ మాత్రం తగ్గడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ బ్రదర్స్ ఆర్థిక మూలాలుపై గట్టి దెబ్బకొట్టారు. ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌ను నిలిపివేయించారు. గనులు రద్దు చేశారు. అంతే కాదు అనేక కేసులు పెట్టారు. జైలుకు పంపారు. అయినా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. చివరికి మున్సిపల్ ఎన్నికల్లో తాడో పేడో అన్నట్లుగా తలపడి.. తాడిపత్రిలో టీడీపీని గెలిచించారు. నిజానికి అక్కడ గెలిచింది టీడీపీ కాదు.. జేసీ ప్రభాకర్ రెడ్డే.
కేతిరెడ్డి వర్గీయులు ఒప్పందాల్ని ఉల్లంఘించి మళ్లీ సవాల్ చేస్తున్నందున.. తాము ఏ మాత్రం వెనక్కి తగ్గినా.. అది తమకు ఓటమే అని జేసీ వర్గీయులు భావిస్తున్నారు. అందుకే ఎక్కడా తగ్గడంలేదు. ఎంత నష్టపోయినా వెనుకడుగు వేసేదే లేదంటున్నారు. అలా ఉంటేనే వర్గాన్ని కాపాడుకోగలుగుతారు. అందుకే తాడిపత్రి ఇప్పుడు... ఎప్పుడూ నివురు గప్పిన నిప్పులా ఉంటుంది. తాడిపత్రిలో 2006లో సూర్యప్రతాప్ రెడ్డి హత్య తర్వాత ముగిసిపోయాయనుకున్న ఫ్యాక్షన్ గొడవలు ఇప్పుడు.. మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇక ముందుఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే.. తాడిపత్రిలో రాజకీయం.. రాజకీయాన్ని దాటి... ముందుకెళ్తోంది...!
Also Read: KRMB Tour : కృష్ణాబోర్డు సీమ టూర్ చివరి క్షణంలో వాయిదా..! అసలు ట్విస్ట్ ఇదే..