అమరావతి: ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బిల్లుల చెల్లింపులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నిధుల చెల్లింపుల విషయంలో అలసత్వం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. కోర్టుల ఆదేశాలు ఎందుకు పాటించడం లేదని, కోర్టులు అంటే మీకు గౌరవం లేదా అంటూ ఏపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. ఇప్పటివరకూ రూ. 1794 కోట్లకు గాను రూ.413 కోట్లు మాత్రమే చెల్లింపులు చెల్లింపులు జరిగినట్లు గుర్తించింది. కోర్టుల ఆదేశాలు ఉల్లంఘించడం సరికాదని, త్వరలో పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగకపోతే దీనిపై ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. 



ఉపాధి హామీ (MGNREGA Bill) పనులకు సంబంధించి ఇప్పటివరకూ రూ.413 కోట్లు చెల్లించామని, మరో నాలుగు వారాల్లో రూ.1,117 కోట్లు చెల్లించనున్నామని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం బిల్లులకు రూ.43కోట్లు మాత్రమే చెల్లించిందని పిటిషనర్ల తరఫు లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో గ్రామ పంచాయతీలకు చెల్లింపులపై సైతం కోర్టు ఆరాతీసింది. అసలు ఏ గ్రామపంచాయతీకి ఎంత చెల్లించారో వివరాలతో సహా పూర్తి అఫిడవిట్‌ సమర్పించాలని ఏపీ సర్కారును ఆదేశించింది. ప్రతిసారి పూర్తి వివరాలతో ఎందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.


Also Read: Water Dispute: కృష్ణా జలాల వివాదం.. పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్వీ రమణ


హైకోర్టులో విచారణకు వచ్చే సమయంలో పూర్తి వివరాలు, సమాచారంతో రావాలని సూచించింది. అధికారులు ఈ విషయాన్ని ఎందుకంత సీరియస్‌గా తీసుకోలేదో అర్థం కావడం లేదని, మీరు చెప్పే సాకులు సైతం దాఖలు చేసిన కౌంటర్లో కూడా పేర్కొనలేదని ధర్మాసనం గుర్తుచేసింది. ఎలాంటి వివరాలు లేకుండా హైకోర్టుకు ఎందుకు వస్తున్నారని ధర్మాసనం నిలదీసింది. ప్రతి బిల్లులో 20 శాతం మేర ఎందుకు కోత విధిస్తున్నారో చెప్పాలని, పూర్తి స్థాయి అఫిడవిట్‌లో అన్ని వివరాలు సమర్పించాలని హితవు పలికింది. ఈ కేసు విచారణను ఆగస్టు 18వ తేదీకి వాయిదా వేసింది.


కోర్టులో విచారణ జరుగుతున్న ఈ బిల్లులపై విజిలెన్స్ విచారణలో తేలిన విషయాలు చెప్పాలని ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్వి ద్వివేదీని ధర్మాసనం ప్రశ్నించింది. ద్వివేదీ దీనిపై సరైన సమాధానం ఇవ్వకపోవడం.. మరోవైపు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కోర్టుకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశించిన వ్యక్తులు, కేసులకు సంబధించిన కీలక వ్యక్తులు తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సీరియస్‌గా తీసుకుని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. విచారణ హాజరు నుంచి మినహాయింపు మాత్రం కోరారని, కానీ అందుకు కారణాలు ఎందుకు ప్రస్తావించలేదని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.


Also Read: River Boards: తెలంగాణకే కాదు ఏపీకి కూడా "గెజిట్"పై అభ్యంతరాలు.. నదీ బోర్డుల వివాదంలో సరికొత్త ట్విస్ట్..!