కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులపై రెండు తెలుగు ప్రభుత్వాలకూ అభ్యంతరాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. గెజిట్ విషయంలో తమతో సంప్రదించకపోవడం దగ్గర్నుంచి అన్ని ప్రాజెక్టులనూ.. బోర్డులకు కిందకు తేవడంపై నిరసన వ్యక్తం చేస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశానికి కూడా వారు హాజరు కాలేదు. కాబట్టి వారి విషయంలో క్లారిటీ ఉంది. అనూహ్యంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. గెజిట్ అమలుకు సహకరించేందుకు సిద్ధంగా లేదు.
కృష్ణా, గోదావరి బోర్డులపై గెజిట్ విడుదల చేయాలంటూ అదే పనిగా కేంద్రానికి లేఖలు రాసి సాధించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. గెజిట్ అమలుకు సహకరించాలని... హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో అధికారులు కోరారు. కానీ ఏపీ అధికారులు మాత్రం తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ అధికారులు ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో వారి అభిప్రాయం నమోదు కాలేదు. కానీ ఏపీ అధికారులు హాజరై.. బెర్డు గెజిట్‌లపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని.. అమలుకు సహకరించబోమని చెప్పేశారు. ఏం అభ్యంతరాలో చెప్పమంటే.. తాము ఇక్కడ చెప్పబోమని..నేరుగా కేంద్రానికే చెబుతామని చెప్పి.. వచ్చేశారు.
ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్ర అధికారులు విస్మయానికి గురయ్యారని జలవనరుల నిపుణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా ప్రాజెక్టులను ఏపీనే .. కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని మొదట కోరింది. రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కృష్ణా జలాల వివాదంలో వివాదాలకు దిగాయి. సీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిలిపివేయాలని ఎన్జీటీ, కేఆర్ఎంబీ ఆదేశించినా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని ఆరోపిస్తూ.. తెలంగాణ సర్కార్.. డెడ్ స్టోరేజీ వరకూ అన్ని ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి చేయాలని జీవో జారీ చేసింది. ఆ మేరకు ఉత్పత్తి కూడా చేశారు. ఆ సమయంలో ఏపీ సీఎం జగన్.. ప్రాజెక్టుల్ని కేంద్ర అధీనంలోకి తీసుకోవాలని లేఖలు రాశారు. చివరికి ప్రాజెక్టుల్ని కేంద్ర అధీనంలోకి తీసుకుని బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ... గెజిట్ జారీ చేశారు.
అయితే ఈ విషయంలో కేంద్రం మరింత చొరవ తీసుకుంది. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిలోకి... ప్రతీ చిన్న ప్రాజెక్టును చేర్చారు. ఏపీలో రాయలసీమ ఎత్తిపోతలను చేర్చలేదు. అంటే.. అసలు అ ప్రాజెక్టును గుర్తించలేదన్న మాట. ఈ ప్రాజెక్టుల పరిధిని డిసైడ్ చేస్తూ విడుదల చేసిన గెజిట‌్‌ను అమలు చేస్తే ... ఏపీ తీవ్రంగా నష్టపోతుందని... జలవనరుల నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కూడా మనసు మార్చుకున్నట్లుగా చెబుతోంది. అన్ని ప్రాజెక్టులను కృష్ణాబోర్డు పరిధిలోకి తేవడం వద్దని... కేవలం వివాదం ఉన్న ప్రాజెక్టుల్ని కేంద్రం పరిధఇలోకి తీసుకుంటే చాలన్నట్లుగా వాదిస్తోంది. ఇదే అంశాన్ని కేంద్రానికి చెప్పాలని అనుకుంటోంది. అందుకే గెజిట్ అమలుకు సహకరించేందుకు ఏపీ సర్కార్ కూడా వెనుకడుగు వేస్తోంది.