తెలంగాణలో 2021- 22 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 5 (గురువారం) నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. దీని ద్వారా రాష్ట్రంలోని 133 పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనుంది.


మొత్తం 30,512 సీట్లు అందుబాటులో ఉండగా.. వీటిలో 780 సీట్లు ఫార్మసీకి విద్యార్థులకు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దాదాపు 3 వేల సీట్లు తగ్గాయి. రాష్ట్రంలో ఉన్న 54 ప్రభుత్వ కాలేజీల్లో 12,042 సీట్లు, ఒక ఎయిడెడ్ కాలేజీలో 230 సీట్లు, 64 ప్రైవేటు కాలేజీల్లో 17,640 సీట్లు, 14 ఫార్మసీ కాలేజీల్లో డిప్లొమా సీట్లు ఉన్నాయి.  పాలిటెక్నిక్ విభాగంలో 100 శాతం సీట్లను కన్వీనర్ కోటా కిందనే భర్తీ చేస్తారు. 


పూర్తి షెడ్యూల్ ఇదే.. 



  • ఆగస్టు 5 నుంచి 9: తొలి విడత రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్  

  • ఆగస్టు 6 నుంచి 10: సర్టిఫికెట్ల వెరిఫికేషన్  

  • ఆగస్టు 6 నుంచి 12: వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి

  • ఆగస్టు 14: మొదటి విడత సీట్ల కేటాయింపు  

  • ఆగస్టు 23 నుంచి: తుది విడత కౌన్సెలింగ్ 

  • ఆగస్టు 24: తుది విడత ధ్రువపత్రాల పరిశీలన  

  • ఆగస్టు 24, 25: తుది విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు

  • ఆగస్టు 27: తుది విడత సీట్ల కేటాయింపు

  • సెప్టెంబర్‌ 1: పాలిటెక్నిక్‌ విద్యా సంవత్సరం ప్రారంభం

  • సెప్టెంబర్‌ 9: స్పాట్‌ అడ్మిషన్లకు మార్గదర్శకాల విడుదల


తెలంగాణలో ఇటీవలే పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పాలిసెట్ ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి వెల్లడించింది. ఎంపీసీ విభాగంలో 81.75 %, బైపీసీ విభాగంలో 76.42 % ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణలో పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం పాలిసెట్ పరీక్షను నిర్వహిస్తారు. జూలై 17న పాలిసెట్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,02,496 మంది అభ్యర్తులు దరఖాస్తు చేసుకోగా, 92,557 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.


ఆంగ్రూ వర్సిటీలో ప్రవేశాలు..
ఏపీలోని గుంటూరుకు చెందిన ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (ఆంగ్రూ) అగ్రిసెట్‌ – 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగేళ్ల బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పించనుంది. డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌/ సీడ్‌ టెక్నాలజీ/ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తు గడువు ఆగస్టు 13తో ముగియనుంది. అగ్రిసెట్ పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం http://www.angrau.ac.in/ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియలపై సందేహాలు ఉంటే 9440137105 నంబరులో సంప్రదించవచ్చు.


Also Read: AGRICET 2021: వ్యవసాయ వర్సిటీల్లో ప్రవేశాలు.. అగ్రిసెట్ నోటిఫికేషన్ విడుదల..