హైదరాబాద్‌లో ఓ మహిళ విచిత్రమైన నమ్మకాలతో ఆత్మహత్య చేసుకుంది. పూజ చేస్తుండగా హారతి ఆరిపోవడం, దేవుడికి బొట్టు పెడుతుండగా కుంకుమ బరిణె కింద పోవడంతో అవన్నీ అరిష్టాలని భావించిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, అప్పటికే కొన్ని గొడవల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. పూజ చేస్తుండగా అపశ్రుతులు జరగడంతో ఇక తన ఆయుష్షు అయిపోయిందని భావించి వెంటనే ఉరేసుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో చోటు చేసుకుంది.
ముందు నుంచే భర్తతో గొడవలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఓం ప్రకాశ్, కవిత ప్రేమించుకొని ఆరేళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు. వీరు జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 78 సమీపంలోని అంబేద్కర్ నగర్‌లో ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఓ నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. ఈ ఓం ప్రకాశ్ వాచ్ మెన్‌గా పని చేస్తుంటాడు. మంగళవారం రాత్రి తన కూతురు కూడా తన డ్యూటీకి తీసుకెళ్లి రాత్రి 7.30 గంటలకు తిరిగి వచ్చాడు. అయితే, ఎన్నిసార్లు తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూశాడు. లోపల తన భార్య ఉరేసుకొని ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.
దీంతో వెంటనే ఓంప్రకాశ్ ఇంటి ఓనర్ సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయి ఉంది. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల వస్తువులను పోలీసులు పరిశీలించగా.. పక్కనే కుంకుమ బరిణె కింద పడిపోయి ఉంది. దీపాలు వెలుగుతున్నాయి. హారతి ఆరిపోయి ఉంది. ఆమె ఫోన్‌ను పరిశీలించగా.. ఆత్మహత్యకు ముందు తీసుకున్న ఓ సెల్ఫీ వీడియో కనిపించింది.
Also Read: Telangana: వృద్ధాప్య పెన్షన్ వయసు పరిమితి తగ్గింపు.. ఇకనుంచి వీళ్లందరికీ ఆసరా పింఛన్లు
దేవుడికి పూజ చేసే సమయంలో హారతిచ్చే ప్రయత్నం చేయగా అది ఆరిపోయింది.. దేవుడికి బొట్టు పెట్టాలని ప్రయత్నిస్తే అది చేజారింది. ఇవన్నీ అరిష్టాలే అని తన ఆయుష్షు తీరిందని సెల్ఫీ వీడియోలో ఆమె చెప్పినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ విషయంలో భర్తను పోలీసులు విచారణ జరపగా ఇద్దరికీ కొద్ది రోజులుగా గొడవలు ఉన్నట్లు తెలిపాడు. దీంతో అప్పటికే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె.. చివరిసారి దేవుడికి పూజ చేసే క్రమంలో ఈ అపశ్రుతులు జరిగాయని, వాటిని అరిష్టాలని నమ్మి ఆమె వెంటనే ప్రాణాలు తీసుకుందని పోలీసులు వెల్లడించారు.
Also Read: Weather Updates: తెలంగాణకు వర్ష సూచన, కొన్ని జిల్లాల్లోనే వానలు.. ఏపీలో వాతావరణం ఇలా..