తెలంగాణలో ఎట్టకేలకు వృద్ధాప్య పింఛను అర్హత వయసును తగ్గించారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ప్రస్తుతం 65 ఏళ్లుగా ఉన్న ఆసరా వృద్ధాప్య పింఛను పథకం అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించారు. ఈ మేరకు పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా జీవో జారీ చేశారు. ఆసరా పింఛన్ల అర్హత వయసును తగ్గించాలని ఆదివారం కేబినెట్‌ సమావేశంలో తీర్మానించిన సంగతి తెలిసిందే. 


తెలంగాణ రాష్ట్రంలో 37 లక్షల మందికి ప్రస్తుతం వృద్ధాప్య పింఛను అందుతోంది. దీనినే ఆసరా పింఛను అని పిలుస్తారు. ఒక్కొక్కరికీ నెలకు రూ.2,016 చొప్పున ప్రభుత్వం ఇస్తూ వస్తోంది. మరో 5 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ.3,016 అందుతోంది. ఏపీలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వృద్ధాప్య పింఛన్‌ కేవలం రూ.200 మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో దానిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదట రూ.వెయ్యి, ఆ తర్వాత రూ.2 వేలకు పెంచింది. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ఈ ఆసరా పింఛన్లకు ఎలాంటి లోటు లేకుండా నిధులు సమకూర్చింది. అంతేకాక, రాష్ట్రంలో కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, వితంతువులు, ఎయిడ్స్‌ రోగులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, చేనేత కార్మికులకు కూడా పింఛన్‌ అందిస్తున్నారు.


Also Read: Petrol-Diesel Price, 5 August: ఈ నగరాలలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ మాత్రం అత్యధికం.. తాజా ధరలు ఇవీ..


‘ఆసరా’కు నెలకు ఎన్ని కోట్ల ఖర్చంటే..
నెల నెలా వృద్ధులకు ఇస్తున్న ఆసరా పింఛన్లకు 2019లో రూ.7,427.32 కోట్లు, ఆ తర్వాతి ఏడాది 2020లో రూ.9,828.33 కోట్లు ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఇప్పుడు అర్హత వయసును తగ్గించడంతో ఈ నిధులు ఇంకా పెరగనున్నాయి. అంచనా ప్రకరాం 57 ఏళ్ల వయసు పైబడి పింఛను ఇవ్వాలంటే ఏటా రూ.12 వేల కోట్ల వరకు అవసరం కానున్నాయి. 2021-22 బడ్జెట్‌లో పింఛన్లకు ఈ మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది. 


Also Read: Gold-Silver Price: స్థిరంగా బంగారం ధర, వెండి మాత్రం పైపైకి.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇలా..


అర్హత ఎలాగంటే..


గ్రామాల స్థాయిలో దరఖాస్తులు స్వీకరించి అర్హులకు పింఛన్లను మంజూరు చేస్తున్నారు. పింఛను వయసు నిర్ధారణకు ఓటరు కార్డు, ఆధార్‌ కార్డు వంటి వాటిని ప్రామాణికంగా తీసుకుంటారు. 50 ఏళ్లు పైబడిన గీత, చేనేత కార్మికులు, 18 ఏళ్లు నిండిన వితంతువులు, 40 శాతానికిపైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు, మూడెకరాలలోపు తరి, 7.5 ఎకరాలు మించకుండా మెట్ట భూమి ఉన్నవారు అర్హులవుతారు.


Also Read: Weather Updates: తెలంగాణకు వర్ష సూచన, కొన్ని జిల్లాల్లోనే వానలు.. ఏపీలో వాతావరణం ఇలా..